ధర్మారం, ఫిబ్రవరి 11: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల ఖానంపల్లి గ్రామానికి చెందిన నిరుపేదలైన ఇద్దరు అనాథ పిల్లలకు కొత్తూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్(NRI Damodar Yadav) తన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన కల్వల రజిత, సతీష్ దంపతులు ఇటీవల వివిధ కారణాలతో వేరువేరు సమయంలో మృతిచెందారు. వారి పిల్లలు కుమారుడు హర్షవర్ధన్ (13), కుమార్తె తనుషా (7) అనాథలుగా మిగిలిపోయారు.
వారికి కనీసం బతకడానికి ఎలాంటి ఆధారం కూడా లేకపోవడంతో ఈ విషయాన్ని ఫోన్ ద్వారా కానంపల్లి గ్రామ యూత్ నాయకులు దామోదర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ఆయన కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా తాత్కాలికంగా10,000 పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఆ డబ్బులను ఫౌండేషన్ ఇన్చార్జి వేల్పులు నాగరాజు అనాథ పిల్లలకు అందజేశారు. ఈ మేరకు దామోదర్ యాదవ్‌ను పలువురు అభినందించారు.