రామగిరి ఫిబ్రవరి 13: సింగరేణివ్యాప్తంగా నర్సరీలో పనిచేస్తున్న కార్మికులకు జీవో ప్రకారంగా వేతనాలు, పీఎఫ్, బోనస్, వైద్యం ఇతరత్రా చట్టబద్ధ హక్కులను అమలు చేయాలని గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకన్న, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు ఇ.నరేశ్ కలిసి సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడు ఒక్కరోజు పనికి రాకపోతే అతను చేసిన వేతనం నుంచి 720 రూపాయలు రికవరీ చేయడం వల్ల కార్మికుడు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలపరిమితి ముగిసిన టెండర్లను సింగరేణి యాజమాన్యం తిరిగి పిలిచినా.. వాటిని వేయకుండా కాంట్రాక్టర్లు నిరాకరించడం వల్ల చాలామంది కార్మికులు ఉపాధి లేక ఇంటి వద్దనే ఉంటున్నారని అన్నారు. ఉదాహరణకు ఓసీపీ వన్ ఓసీపీ టు ఆర్జీ 3 ఏరియాలో ఇలాంటి పరిస్థితి ఉన్నదని తెలిపారు. కాబట్టి సింగరేణి యాజమాన్యం తీసుకొచ్చిన ఈ సర్కులర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నర్సరీలో పనిచేస్తున్న కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇవ్వడం, ఎలాంటి చట్టబద్ధ హక్కులు అమలు కాకపోవడం వంటి అంశాలపై పలుదపాల ఆందోళన చేశామని గుర్తుచేశారు. ఇప్పటికైనా ఈ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు సీఎం పీఎఫ్, బోనస్, వైద్యం, చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని సీఎండీ బలరాంను కోరామని అన్నారు.