కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ
అధికారులతో సమీక్ష
పెద్దపల్లి జంక్షన్, ఆగస్టు 23: జిల్లాలో ఈ నెలాఖరులోగా ఏడో విడుత హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశించారు. పల్లె ప్రగతి, ఉపాధి హామీ పనులు, పలు అంశాలపై కలెక్టర్ సోమవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పల్లె లు, పట్టణాల్లో పచ్చదనం పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ నూతన పంచాయతీరాజ్, నగరపాలక చట్టాలను ప్రవేశపెట్టి మొక్కల పెంపకం అంశాలను చట్టంలో పకడ్బందీగా చేర్చారని వివరించారు. పల్లె, పట్టణ ప్రగతిలో హరిత ప్రణాళికలను పక్కాగా అమలు చేయాలని, 100 శాతం గ్రీన్ బడ్జెట్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏడో విడుత హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, జీపీ పరిధిలో ట్రాక్టర్, ట్యాంకర్ను సంపూర్ణంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. రహదారుల వెంట పెద్ద మొత్తంలో మొక్కలు నాటి టీగ్రార్డులు ఏర్పా టు చేయాలన్నారు. జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని, చెల్లింపు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర దీపక్ కుమార్, డీఆర్డీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అభినందన
బాసర ఐఐఐటీకి ఎంపికైన విద్యార్థులను కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ అభినందించారు. సుల్తానాబాద్ మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి సీటు సాధించిన ప్రదీప్, ఎం అరవింద్, జే సిజ్జువర్ధన్, బీ శరత్ను సోమవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాధన కోసం కష్టపడి చదవాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇక్కడ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, పాఠశాల ప్రత్యేక అధికారి రత్నాకర్, ఉపాధ్యాయుడు హెచ్ సంతోష్, క్లర్క్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.