ఫర్టిలైజర్‌సిటీ, ఆగస్టు 21: ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రముఖుల పేర్లపై సోషల్ మీడియాలో ఖాతాలు రూపొందించి అత్యవసరంగా డబ్బు కావాలని, లాటరీ తగిలిందని, ముందుగా కొంత డబ్బు కట్టాలి, తక్కువ ధరకే వాహనాలు అనే మాటలు చెప్పి అమాయకుల ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. సైబర్ నేరాలపై ఠాణాల పరిధిలో కరపత్రాలతో ప్రచారం చేయాలని సూచించారు.
వివిధ రూపాల్లో మోసాలు..
మంచిర్యాలలో ఈ నెల 19వ తేదీన ఓ వ్యక్తి అమెజాన్ కంపెనీలో ఉద్యోగం ఉందని ఎస్ఎంఎస్ లింక్ పంపించి అది నమ్మిన నిరుద్యోగి లిం క్‌ను సెర్చ్ చేశాడు. ఉద్యోగం కావాలంటే మొదట రూ.వెయ్యి, తర్వాత రూ. 2వేలు, మొత్తం రూ.30వేలు ఆన్లైన్ నుంచి సైబర్ నేరగాళ్లు తీసుకున్నారని వివరించారు. రామగుండం పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి గత నెల 6వ తేదీన సైబర్ నేరగాడు ఫోన్ చేసి యాంజల్ కంపెనీ మేనేజర్‌ను మాట్లాడుతున్నానని, రూ.15వేలు పెట్టుబడి పెడి తే వారంలో రూ.లక్ష వస్తాయని నమ్మించి ఫోన్ పే ద్వారా పంపించగానే సెల్ స్విచ్ఛాఫ్ చేశాడని గుర్తు చేశారు. గోదావరిఖనిలో ఈ నెల 16వ తేదీన సైబర్ నేరగాడు ‘ఫ్రీ ఫైర్ గేమ్’ లాగిన్ ఐడీ పాస్వర్డ్ పంపిస్తానని నమ్మించి ఫోన్ పే నుంచి డబ్బు పంపగానే స్విచ్చాఫ్ చేశాడన్నారు. ఇటీవల గోదావరిఖనిలో ఒకరు ఖాతా నుంచి రూ.40 వేలు తప్పుగా వేరే వ్యక్తికి వెళ్లగా అతడు పంపిస్తా అని దాటవేస్తున్నాడని, అలాగే మరో వ్యక్తికి ఇన్‌స్టా గ్రాంలో రూ.1200కే రెండు డ్రెస్సులని, మంచిర్యాలకు చెందిన ఓ టైల్స్ షాపు యజమానికి లారీలోడు టైల్స్ తక్కువ ధరకే ఇస్తానని నమ్మించి రూ.లక్ష మోసం చేశాడని, మంథనికి చెందిన ఒకరిని 20 రోజుల క్రితం హనీ ఆన్లైన్ షాపింగ్ ద్వారా పెట్టుబడి పెడితే ఒక్కరోజులో 10 శాతం కమిషన్ వస్తుందని నమ్మించి రూ.31, 700లు కాజేశాడని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు వివిధ రూపాల్లో వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని, గుర్తు తెలియని వ్యక్తులు అదే పనిగా లింకులు పంపిస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 155260 టోల్ ఫ్రీకి లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని సీపీ తెలిపారు.