వినూత్న డిజైన్లు.. రంగురంగుల రక్షలు
రూ.1 నుంచి మొదలుకొని రూ.500 వరకు ధర
మహిళలకు ఉపాధినిస్తున్న ఎస్ఆర్ఆర్ కేంద్రం
పలు రాష్ర్టాలకు ఎగుమతి రేపే రాఖీ పౌర్ణమి
జోరందుకున్న విక్రయాలు
పెద్దపల్లి, ఆగస్టు 20: రాఖీ పండుగు.. రక్షా బంధన్.. పేరు ఏదైనా సోదర సోదరీమణుల ఆత్మీయత అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది.. ‘నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష..’ అని అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనురాగానికి అనుబంధానికి సాక్ష్యంగా నిలుస్తుంది. దేశ వ్యాప్తంగా రాఖీ పండగను పెద్ద ఎత్తున ఈ నెల 22న జరుపుకోనున్నాం. మనకు రెండు మూడు రోజుల ముందు నుంచే పండగా ప్రారంభమైతే.. అసలు రాఖీలు తయారు చేసే వారికి 6నెలల నుంచే ప్రారంభమైంది. రాఖీల తయారీకి కొంతకాలంగా పెద్దపల్లి జిల్లా కేరాఫ్‌గా నిలుస్తున్నది. జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్ సమీపంలో ఉన్న రాజరాజేశ్వర రాఖీ కేంద్రం(ఎస్ఆర్ఆర్) నిర్వాహకులు తక్కువ ధరల్లో సామాన్యుడికి అందుబాటులో ఉండేలా సరికొత్త రాఖీలు తయారు చేసి విక్రయిస్తున్నారు. రంగు రంగుల దారాలు, తీరొక్క ముత్యాలు.. కుందన్లు, రుద్రాక్షలు, తులసీ, రంగు పూసలు, రంగు రాళ్లు, రంగు రంగుల ముత్యాలు, చిన్న పిల్లలు ఇష్టపడే వాచ్ బెల్ట్ రాఖీలు లైటింగ్, కిడ్స్ జాయ్, స్పైడర్‌మన్ రాఖీలు, మ్యూజికల్ రాఖీలతో పాటుగా కొంచెం ఖరీదైన రుద్రాక్ష, జరీ, ఫ్యాన్సీ, గోల్డ్ కోటి,గ్, సిల్వర్, బ్రాస్లెట్ రాఖీలను తయారు చేసి పెద్దపల్లి కేంద్రంగా రాఖీ విక్రయాలను కొనసాగిస్తున్నారు. స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.
పెద్దపల్లి నుంచి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి..
రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల నుంచి ముడిసరుకులను దిగుమతి చేసుకుని అందమైన రాఖీలు తయారు చేసి తిరిగి అవే రాష్ర్టాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు ఎస్ఆర్ఆర్ నిర్వాహకులు. సామాన్యులకు అందుబాటులో రాఖీలను విక్రయిస్తూ అందరి మెప్పు పొందుతున్నారు. రూ. 1 నుంచి మొదలుకొని రూ. 500 వరకు వివిధ రకాల రాఖీలను టోకు ధర రూపంలో విక్రయిస్తుండగా వర్తకులు వీటిని అదనపు రుసుము జోడించి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.
ఏటా వంద మందికి ఆరు నెలలపాటు ఉపాధి
ఎస్ఆర్ఆర్ రాఖీ కేంద్రం ద్వారా ఏటా వంద మంది మహిళలు ఆర్నెళ్ల వరకు ఉపాధి పొందుతున్నారు. వివిధ రకాల రాఖీలు తయారు చేసి ఇతర రాష్ర్టాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. రాఖీ తయారీ కేంద్రంలో ప్రతీ రోజు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం.
-ఉప్పు కృష్ణమూర్తి, నిర్వాహకుడు, ఎస్ఆర్ఆర్ రాఖీ కేంద్రం, పెద్దపల్లి.