భవన నిర్మాణాల్లో అవకతవకలకు చెక్‌పెట్టేందుకు కొత్త యాప్
పట్టణాల్లో ప్రతి ఇంటికీ జియో ట్యాగింగ్
పెద్దపల్లి జిల్లాలో వేగంగా సర్వే
ఇప్పటికే 36,259 ఆస్తుల వివరాలు ఆన్లైన్
ఈ నెలాఖరుకల్లా పూర్తికి వేగంగా అడుగులు
ఇక మున్సిపాలిటీలకు పెరుగనున్న ఆదాయం
పెద్దపల్లి, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): ఇంటి పర్మిషన్లో ఒకలా.. క్షేత్రస్థాయిలో మరోలా నిర్మించుకుంటూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నవారి పనిపట్టేందుకు రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. పట్టణాల్లోని భవనాల నిర్మాణ విస్తీర్ణం సహా ఇండ్ల లెక్క పక్కాగా తేల్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలే భువన్యాప్ను తీసుకురాగా, పెద్దపల్లి జిల్లాలో యంత్రాంగం రంగంలోకి దిగింది. సర్వేలో భాగంగా ప్రతి వ్యాపార, నివాస సముదాయాలను జియోట్యాగింగ్ చేస్తున్నది. ఇప్పటికే రామగుండం కార్పొరేషన్ సహా పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో 36,259 ఆస్తుల వివరాలు ఆన్లైన్ చేయగా, పూర్తయితే బల్దియాల ఆదాయం పెరుగనున్నది.
పట్టణాలు రోజు రోజుకూ విస్తరిస్తున్నాయి. ఇండ్లు, భవన నిర్మాణాలు శరవేంగా సాగుతున్నాయి. పలువురు గృహాల పేరిట అనుమతి తీసుకొని వ్యాపార సముదాయాలు నిర్మిస్తుండడం, అనుమతి తీసుకున్న దానికి మించి అదనపు గదులు నిర్మిస్తుండడంతో మున్సిపాల్టీలకు రావాల్సిన ఆదాయం తగ్గుతున్నది. దీంతో ప్రభుత్వం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అసెస్మెంట్ (ఆస్తులు)లలో తేడా లేకుండా ఉండేందుకు ఇంటి నిర్మాణాలు, విలువ పక్కా లెక్క తేల్చేందుకు ఇటీవలే భువన్ యాప్‌ను తెచ్చింది. మున్సిపాల్టీల్లో ఉన్న నివాసాలు, వ్యాపార సముదాయాలను జియో ట్యాగ్ చేస్తూ వివరాలన్నీ యాప్‌లో నమోదు చేయాని ఆదేశాలతో యంత్రాంగం రంగంలోకి దిగింది. వాస్తవానికి భువన్యాప్ను కొద్ది నెలల క్రితమే తెచ్చి, సర్వే చేయాలని ప్రభుత్వం సూచించగా, కరోనాతో బ్రేక్ పడింది. ప్రస్తుతం రామగుండం కార్పొరేషన్‌తో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాల్టీల్లో సర్వే వేగంగా జరుగుతున్నది. ఆస్తుల వివరాలు కచ్చితంగా నమోదు చేయడం ద్వారా పన్ను ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏం చేస్తున్నారంటే..
సర్వేలో భాగంగా ప్రతి ఇంటి నిర్మాణం, విస్తీర్ణం, ఎన్ని అంతస్తులు, సౌకర్యాలు, నివాసమా, వ్యాపార సముదాయమా అనే వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, మేనేజర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో బిల్ కలెక్టర్లు బృందాలుగా వెళ్లి నమోదు చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా యాప్‌లో అప్లోడ్ చేస్తారు. సర్వే పూర్తయితే ఆస్థి పన్ను తక్కువగా చూపడం, పన్నులు చెల్లించకుండా తప్పించుకోవడం వంటి అక్రమాలకు తావుండదు. కొందరు పాత ఇళ్లు తొలగించి.. కొత్తది నిర్మించడం.. భవనంపై కొత్తగా అంతస్తులు నిర్మిస్తున్నా పాత పన్ను చెల్లిస్తుండడంతో మున్సిపాల్టీలకు ఆదాయం పెద్దగా రావడం లేదు. ప్రస్తుత సర్వే ద్వారా అన్నీ ఆన్లైన్లో నమోదవుతుండడంతో అక్రమాలకు తావుండకుండా ఉండనుంది. కాగా సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉద్యోగులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఇప్పటి వరకు రామగుండం కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాల్టీలో పరిశీలిస్తే మొత్తం 68,490 ఆస్తుల్లో ఇప్పటివరకు 36,259 ఆస్తుల వివరాలు జియో ట్యాగింగ్ పూర్తయింది. అయితే నివాసాల జియో ట్యాగింగ్ సర్వే వేగంగా జరుగుతుండగా.. నివాసం వ్యాపారం కలిసి ఉన్న సముదాయాల వద్ద మాత్రం ఎక్కువ సమయం పడుతోందని సిబ్బంది చెబుతున్నారు.
35బృందాలతో సర్వే..
జిల్లాలోని 35 బృందాలతో 68,490 అసెస్ మెంట్లను సర్వే చేస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థలోని 50డివిజన్లో 17బృందాలు, పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 36వార్డుల్లో 8బృందాలతో, సుల్తానాబాద్ మున్సిపాల్టీ పరిధిలోని 15వార్డుల్లో 4బృందాలతో, మంథని మున్సిపాల్టీ పరిధిలోని 13వార్డుల్లో 6బృందాలతో సర్వే చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు.
పకడ్బందీగా చేస్తున్నాం..
భువన్ సర్వేను రామగుండం కార్పొరేషన్ పరిధిలో 18బృందాలతో నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 60శాతం సర్వే పూర్తయింది. అన్ని డివిజన్లలోనూ లెక్కలు తీస్తున్నాం. కొవిడ్ వల్ల సర్వేలో జాప్యమైంది. మళ్లీ ప్రభుత్వ ఆదేశాలతో సర్వే చేపట్టాం. ఈ నెల 30వరకు రామగుండం కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో పూర్తి చేస్తాం.
-ఉదయ్‌కుమార్, కమిషనర్ రామగుండం నగరపాలక సంస్థ