కొడిమ్యాల నుంచి గౌరాపూర్ దాకా ఏడు చెక్‌డ్యాంలు
9కోట్లతో నిర్మాణం.. తుది దశకు పనులు
ఇటీవలి వర్షాలకు జలకళ
ఒక్కోదాని పరిధిలో 400 ఎకరాల సాగు
ఎమ్మెల్యే రవిశంకర్ కృషితో పనుల్లో వేగం
ఆనందంలో రైతులు
కొడిమ్యాల, ఆగస్టు 18 :వృథానీటికి అడ్డుకట్ట వేసి.. వాగులు, వంకలను సజీవంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది. అందులో భాగంగా 9.31కోట్లతో కొడిమ్యాల నుంచి గౌరాపూర్ దాకా పెద్దవాగుపై ఏడు చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నది. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చొరవతో పనులు శరవేగంగా తుది దశకు చేరుకున్నాయి. ఇటీవలి వానలకు జలకళను సంతరించుకోవడమే కాదు, మత్తళ్లు దుంకాయి. నిన్నామొన్నటి దాకా చుక్కనీరు లేని వాగులో పుష్కలంగా నీళ్లు కనిపిస్తుండడంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
చుక్కా చుక్క నీటిని ఒడిసి పట్టి, వాగులూ వంకలను సజీవంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు పక్కా ప్రణాళికతో ముం దుకు సాగుతున్నది. అందులో భాగంగానే 9.31 కోట్లు వెచ్చించి కొడిమ్యాల నుంచి గౌరాపూర్ దాకా పెద్దవాగుపై ఏడు చెక్ డ్యాంలను నిర్మిస్తున్నది. 2020 డిసెంబర్ 28న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పూడురు శివారులో శంకుస్థాపన చేశారు. ఇరిగేషన్ అధికారులు రెండు క్లస్టర్లుగా విభజించి పనులు చేపట్టారు. ఇప్పటికే తుది దశకు చేరగా, 90 శాతం పూర్తయ్యాయి. ఆయాచోట్ల ఇటీవలి వర్షాలకు జలకళను సంతరించుకున్నాయి.
ఎల్లంపల్లి నీటితో జలకళ..
కొండాపూర్ మైసమ్మ చెరువు, పోతారం రిజర్వాయర్‌ను పంటల కాలంలో ఎల్లంపల్లి నీటితో అధికారులు నింపుతున్నారు. గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి పంప్‌హౌస్ ద్వారా మైసమ్మ చెరువుకు నీటిని వదులుతున్నారు. ఇక్కడి నుంచి పంప్‌హౌస్ ద్వారా కోనాపూర్ పోతారం రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తున్నారు. మైసమ్మ చెరువు, పోతారం రిజర్వాయర్లు మత్తళ్లు దూకడంతో కొడిమ్యాల పెద్దవాగు ప్రవహిస్తుంది. దాంతో చెక్‌డ్యాంలకు జలకళ వస్తుంది. ఏడాది పొడవునా నీరు ఉండనున్నది.
భూగర్భ జలాలు పెంపు..
చెక్‌డ్యాంలతో భూగర్భ జలాలు అమాంతం పెరుగుతాయి. ఒక్కో దాని కింద సుమారు దాదాపు 400 ఎకరాల భూమి సాగులోకి వస్తునట్లు అధికారులు తెలిపారు. చెక్ డ్యాంలో 7 మిలియం క్యూబిక్ ఫీట్లలో (దాదాపు 9 మీటర్లు) నీరు నిల్వ ఉంటుంది. ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండనున్నది. వేసవిలోనూ ఇబ్బందులు లేకుండా పంటలు సాగు చేసుకునే అవకాశముంటుంది.
ఏడాది పొడవునా నీళ్లు..
చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సంవత్సరం పొడవునా నీరు నిల్వ ఉంటుంది. వీటి నిర్మాణానికి ఎలాంటి భూ సేకరణ చేయాల్సిన అవసరం లేదు. కొడిమ్యాల నుంచి గౌరాపూర్ దాకా ఏడు చెక్‌డ్యాంల పనులు 90 శాతం పూర్తయ్యాయి. త్వరలోనే రైతులకు అందుబాటులోకి వస్తాయి.
సంతోషంగా సాగు చేసుకుంటున్నం..
గతంల మా భూములకు నీరందక బతుకుదెరువుకు ముంబై, భీవండికి వెళ్లేవాళ్లం. అప్పారావుపేట పెద్దవాగుపై చెక్ డ్యాం నిర్మించడంతో పుష్కలంగా నీళ్లున్నాయి. ఇప్పుడు మాకు నీటి గోస తప్పింది. అందుకే మా ఊరికి తిరిగొచ్చినం. అందరం సంతోషంగా సాగు చేసుకుంటున్నం.
రైతులకు రంది పోయింది..
చెక్‌డ్యాంల నిర్మాణంతో వాగులో మస్తు నీళ్లు నిలిచినయి. ఇక నుంచి రెండు పంటలకు ఢోకా లేదు. రైతులందరికీ రంది పోయింది. చెక్‌డ్యాంలు నిర్మించిన సర్కారుకు రుణపడి ఉంటం.
చెక్‌డ్యాంలు ఇక్కడే..
పెద్దవాగుపై మొత్తం ఏడు చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నారు. క్లస్టర్-1 పరిధిలో నాలుగు, క్లస్టర్-2 పరిధిలో మూడు నిర్మిస్తుండగా, ఆయాచోట్ల వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే తుది దశకు చేరాయి.
క్లస్టర్-1లో..
ఒకటో చెక్ డ్యాం.. కొడిమ్యాల సుద్దకట్టు వద్ద..
రెండోది,, నాచుపల్లి సిద్దుల వాగు వద్ద..
మూడోది.. అప్పారావుపేట పర్రెకాలువ వద్ద..
నాలుగోది.. పూడూర్ రైల్వే బ్రిడ్జి వద్ద..
క్లస్టర్-2.. ఒకటోది.. పూడూర్ ఎల్లమ్మ ఆలయం
రెండోది తూర్పు హనుమాన్ వాడలో..
మూడోది ఆరెపల్లి -గౌరాపూర్ గ్రామాల మధ్య..