రాష్ట్రవ్యాప్తంగా ద్వితీయ స్థానంలో సిరిసిల్ల దవాఖాన
జగిత్యాల జిల్లా దవాఖాన, హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్, సుల్తానాబాద్ సీహెచ్‌సీకి ‘ప్రశంస’
జిల్లాల వారీగా 29 పీహెచ్‌సీలు, 9 యూపీహెచ్‌సీలకు అవార్డులు
స్వచ్ఛత, మెరుగైన సేవలకు గుర్తింపు
వైద్యలు, సిబ్బంది హర్షం
పెద్దపల్లి (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్/ జగిత్యాల/ హుజూరాబాద్, జూలై 6 : మెరుగైన వైద్య సేవలందిస్తున్న ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలకు గుర్తింపు లభించింది. సోమవారం ప్రకటించిన ‘కాయకల్ప’ అవార్డుల్లో రాష్ట్ర స్థాయిలో చోటు దక్కింది. రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖాన రెండో స్థానంలో నిలిచింది. జగిత్యాల జిల్లా దవాఖాన, ఏరియా దవాఖానల పరిధిలో హుజూరాబాద్, సీహెచ్‌సీల పరిధిలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ హాస్పిటల్ ‘ప్రశంస’ అవార్డులు దక్కించుకున్నాయి. స్వచ్ఛత, నాణ్యమైన సేవలు, కార్పొరేట్‌కు దీటుగా అందుతున్న వైద్యానికి ఫలితం దక్కగా, వైద్యసిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ప్రభుత్వ వైద్య సేవల బలోపేతానికి రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నది. అధునాతన సదుపాయాలు, అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తేవడంతో పాటు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తున్నది. పరిశుభ్రత, మంచి వాతావరణం కల్పిస్తూ రోగులను కంటికి రెప్పలా కాపాడుతున్నది. దీని ఫలితంగా స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న రాష్ట్ర, జిల్లా స్థాయి కాయకల్ప అవార్డుల్లో అనేక దవాఖానలు ఎంపికవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖాన రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలువగా, రూ.20 లక్షల నగదు దక్కనున్నది. జగిత్యాల జిల్లా దవాఖానకు ప్రశంస అవార్డు రాగా, రూ.3 లక్షల నగదు రానున్నది. ఏరియా దవాఖానల పరిధిలో హుజూరాబాద్, సీహెచ్‌సీల పరిధిలో సుల్తానాబాద్‌కు ప్రశంస అవార్డు రాగా, రూ.లక్ష చొప్పున నగదు రానున్నది. వీటితో పాటు 29 పీహెచ్‌సీలు, 9 పీహెచ్‌సీలకు కాయకల్ప అవార్డులు వచ్చాయి. ఈ అవార్డుల కింద వచ్చిన నగదును దవాఖానల్లో ప్రధానంగా పారిశుధ్యం నిర్వహణకే అధిక శాతం నిధులు ఉపయోగించుకోవాలి. మిగిలిన వాటిని దవాఖాన ఆవరణలో మొక్కలు నాటడం, గార్డెన్ ఏర్పాటు, సూచిక బోర్డులు, రోగులకు మౌలిక వసతుల కల్పన తదితర సౌకర్యాల ఏర్పాటుకు వినియోగిస్తారు.
అవార్డు ఎంపిక విధానం
ప్రభుత్వ దవఖానల్లో మెరుగైన వసతులు, పారిశుధ్య నిర్వహణ, వ్యర్థ పదార్థాల ఏరివేత, వైరస్ రోగుల నివారణతో పాటు తదితర అంశాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన దవాఖానలకు కాయకల్ప పథకం కింద ఉత్తమ అవార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో మొదటి బహుమతి రూ.50లక్షలు, రెండో బహుమతి రూ.20 లక్షలు అందిస్తోంది. ఈ అవార్డు ఎంపికలో భాగంగా గత ఫిబ్రవరి మాసంలో కేంద్ర ఎన్హెచ్ఆర్సీ బృందం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానలను సందర్శించి ప్రత్యేక సర్వే నిర్వహించింది.
సేవల్లో సిరిసిల్ల జిల్లా దవాఖాన భేష్
మెరుగైన వైద్య సేవలు అందిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖాన ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ కారణంగా అధునాతన పరికరాలు, సౌకర్యాల కల్పనకు తోడు వైద్య సిబ్బంది సమష్టి కృషి, 24 గంటల వైద్య సేవలతో కార్పొరేట్ దవాఖానలకు దీటుగా నిలుస్తున్నది. రోజుకు వందలాది మంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఇక్కడి వైద్యులు.. పరిసరాల పరిశుభ్రతతో పాటు రోగులకు అందిస్తున్న మెరుగైన వైద్య సేవల విభాగంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కాయకల్ప అవార్డుల సర్వేలో రాష్ట్రంలో 79.5 శాతం మార్కులతో రెండో స్థానంలో నిలిచింది. కాగా, ఈ దవాఖానకు కాయకల్ప అవార్డుతో పాటు అదనపు మౌలిక వసతుల కల్పన కోసం రూ.20 లక్షలు ప్రత్యేక నిధులు అందిస్తున్నది.
సేవలకు దక్కిన ఫలితం
జగిత్యాల జిల్లా దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. పారిశుధ్య నిర్వహణతో పాటు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాం. సిబ్బంది అందిస్తున్న సేవలకు దక్కిన గౌరవమిది. ఈ అవార్డుతో సిబ్బంది మరింత ఉత్సాహంతో సేవలు అందించే వీలుంటుంది.
బాధ్యత మరింత పెరిగింది
జిల్లా దవాఖానను గత ఫిబ్రవరిలో సందర్శించిన కేంద్ర బృందం సభ్యులు ఇక్కడ అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో ప్రకటించిన అవార్డుకు ఎంపికవడం ఆనందంగా ఉంది. మాపై బాధ్యత మరింత పెరిగింది. సిబ్బంది సమష్టి కృషితో కారణంగా అవార్డుకు ఎంపికైనం. పారిశుధ్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, అందరూ విధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందరి సహకారంతో దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.