సంక్షోభంలోనూ సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే
గత ప్రభుత్వాలు చేసింది శూన్యం
పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కాసులపల్లిలో పల్లెప్రగతి కార్యక్రమానికి హాజరు
పాల్గొన్న ఎంపీ వెంకటేశ్‌నేతకాని, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి రూరల్, జూలై 5: రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉద్ఘాటించారు. పెద్దపల్లి మండలం కాసులపల్లిలో సోమవారం పల్లెప్రగతి కార్యక్రమానికి ఎంపీ వెంకటేశ్‌నేతకాని, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణతో కలిసి హాజరై, మాట్లాడారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరోనా సంక్షోభ సమయంలోనూ సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పునరుద్ఘాటించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే 22 కోట్లు ఇచ్చామని, మరిన్ని నిధులిస్తామని పేర్కొన్నారు.
కాసులపల్లి గ్రామపంచాయతీ భవనంతోపాటు సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.50 లక్షలు ఇస్తామని వెల్లడించారు. వెంటనే పంచాయతీ భవనాన్ని నిర్మించి గ్రామానికే ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని సూచించారు. గతంలో ప్రభుత్వాలు చేసింది శూన్యమని, పల్లె ప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. మొక్కలు నాటి సంరక్షించిన వారికే ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం ఉంటుందని, ప్రతి ఒక్కరూ సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎంపీ వెంకటేశ్‌నేతకాని మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు గర్వించేలా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి మూడేండ్లలోనే పూర్తి చేశారని కొనియాడారు. కాసులపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి బహుమానంగా ఇవ్వాలని గ్రామస్తులను కోరారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ, పల్లెప్రగతిలో తమ కార్యక్రమంగా భావించి భాగస్వాములు కావాలని కోరారు. హరితగ్రామాలే లక్ష్యంగా ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
తర్వాత కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, పల్లెప్రగతిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. హరితహారంలో పెద్ద మొక్కలు నాటాలన్న మంత్రి ఆదేశాలను పక్కాగా పాటిస్తామని, సాధ్యమైనంత త్వరలోనే మొక్కలు తెప్పిస్తామని తెలిపారు. మొక్కలు నాటి సంరక్షించినవారికే ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం ఇవ్వాలన్న మంత్రి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని, ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. కాగా, అంతకుముందు గ్రామానికి వచ్చిన మంత్రికి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జీ రఘువీర్ సింగ్, సర్పంచ్ దాసరి పద్మ చంద్రారెడ్డి, ఎంపీపీ బండారి స్రవంతిశ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ రామ్మూర్తి ఉన్నారు.