Birthday gift | కోల్ సిటీ , మే 2: కూతురు పుట్టిన రోజున తల్లిదండ్రులు బహుమానంగా ఖరీదైన వస్తువో లేక మంచి బట్టలు కొనివ్వడం లేదా ఏదైనా షాపింగ్ తీసుకెళ్లడం సాధారణంగా చూస్తుంటాం. కానీ గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన సింగరేణి కాంట్రాక్టర్ కట్ల లక్ష్మీనారాయణ, అతని భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు స్వరూపలు శుక్రవారం తమ కుమార్తె శ్రీమేధ పుట్టిన రోజున సమాజం గర్వించే నిర్ణయం తీసుకున్నారు.
తమ మరణానంతరం నేత్ర, అవయవదానం చేయాలని అంగీకారం తెలిపారు. వారి స్వగృహంలో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యాంసుందర్, సదాశయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, ప్రచార కార్యదర్శి వాసులు హాజరై ఆ దంపతులకు అంగీకార పత్రాలను అందజేసి అభినందించారు. ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయమన్నారు.
మరణానంతరం నేత్రాలు, అవయవాలు దానం చేయడం వల్ల మరొకరికి పునర్జన్మ ప్రసాదించడం వల్ల మానవ జన్మకు సార్ధకం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో సదాశయ సభ్యులు రాములు, సరోజన, మగువ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు శశికళ, సదాశయ సభ్యులు నాగుల శంకర్, సుదర్శన్, దబ్బెట శంకర్, కుటుంబ సభ్యులు సమ్మక్క, చంద్రశేఖర్, స్రవంతి, సాహితీ, ప్రవీణ్. ఆరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.