ACB Raids | గంగాధర, అక్టోబర్ 10 : ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన గంగాధర మండలంలో సంచలనం గా మారింది. ఏసీబీ అధికారులు, బాధితుడి కథనం మేరకు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామానికి గంగాధర లాస్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. ఇల్లు నిర్మాణంలో భాగంగా లక్ష రూపాయల బిల్లును ప్రభుత్వం మంజూరు చేసింది.
లాస్య భర్త గంగాధర శ్రీకాంత్ మధురానగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మునిగాల అనిల్ ను కలిసి బిల్లు చెల్లించాలని విజ్ఞప్తి చేశాడు. ఇందిరమ్మ ఇల్లు కు సంబంధించిన బిల్లు చెల్లించాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి శ్రీకాంతును డిమాండ్ చేశాడు. కార్యదర్శి చుట్టూ తిరిగి విసిగిపోయిన శ్రీకాంత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనతో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ కు శ్రీకాంత్ రూ. 10 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
పంచాయతీ కార్యదర్శి నుండి రూ. 10 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనిల్ పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వాధికారులు ఎవరికి ప్రజలు లంచం ఇవ్వవద్దని, పనులు చేయడానికి అధికారులు లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.