కోల్ సిటీ, మార్చి 9 : హైదరాబాద్లో ఆదివారం జరిగిన 17వ అఖిల భారత పద్మశాలి మహాసభలు, ఎనిమిదవ తెలంగాణ పద్మశాలి మహాసభలో పాల్గొనేందుకు రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి పద్మశాలీలు తరలి వెళ్లారు. రామగుండం ఏరియా పద్మశాలి సేవా సంఘం, పోపా, మహిళా సంఘం, యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గోదావరిఖని నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు. పద్మశాలీల ఐక్యత, అభివృద్ధి లక్ష్యసాధనలో భాగంగానే ఈ మహాసభలకు హాజరయ్యేందుకు వెళుతున్నట్లు ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు.
రాజకీయ స్వలాభం కోసమేనా..?
కాగా, ఈ మహాసభలు రాజకీయ స్వలాభం కోసమేనా అని రామగుండం పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆడెపు శంకర్ ప్రశ్నించారు. హైదరాబాద్లో జరిగిన అఖిల భారత మహాసభలకు రామగుండం నుంచి ఒక వర్గం కు చెందిన వారు మాత్రమే వెళ్లడం, మిగతా వారికి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మరోసారి రామగుండం పద్మశాలి సంఘంలోని వర్గ విభేదాలు రోడ్డెక్కాయి. కేవలం రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి పద్మశాలి కులస్తులను వాడుకోవడం సరైన పద్ధతి కాదంటూ ఆ సంఘం కు చెందిన సీనియర్ నాయకులు ఆడెపు శంకర్ తో పాటు పలువురు బహటంగానే ఆరోపించారు.
పైగా ఈ మహాసభకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఆహ్వానించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఇవి రాజకీయ సభల..? లేక పద్మశాలీల ఐక్యత కోసం నిర్దేశించిన సభలా.? అని ప్రశ్నించారు. రామగుండం నియోజకవర్గం లోని పద్మశాలీలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ రాజకీయ మహాసభల వల్ల పద్మశాలీలకు ఒరిగేదేమిటని, ఇప్పటికే రాష్ట్ర యావత్ ప్రజలకు ఇచ్చిన హామీలనే ఇప్పటివరకు నెరవేర్చని కాంగ్రెస్ పెద్దమనుషులు పద్మశాలీల అభివృద్ధికి పాటుపడతారా అనేది ఆలోచన చేయాలన్నారు.