రాజన్న సిరిసిల్ల, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారు పాలనను గాలికొదిలేసింది. సాగునీటి నిర్వహణను మరిచింది. వ్యవసాయానికి సంబంధించి ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నది. ఒకనాడు తీవ్ర కరువు, దుర్భిక్షంతో కొట్టుమిట్టాడిన మెట్టను బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వర జలాలు సుభిక్షం చేయగా, మధ్యమానేరు ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో కరువు తీరింది.
ఇంకా వానకాలంలో వాగుల్లో పారే నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలు పెంచేందుకు అటు గంభీరావుపేట మండలం నర్మాల నుంచి, ఇటు కోనరావుపేట మండలం నిమ్మపల్లి నుంచి మధ్యమానేరు దాకా ప్రవహించే మానేరు, మూలవాగుపై 200 కోట్లతో 12 చెక్ డ్యాంలు నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగా, ప్రస్తుత ప్రభుత్వం ఎండబెట్టే ప్రమాదం కనిపిస్తున్నది.
గతేడాది భారీ వరదకు సిరిసిల్ల నెహ్రూనగర్ ఓ చెక్‌డ్యాం కూలిపోయి నీరు వృథాగా పోతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నది. ఈ యేడు వానకాలం వచ్చినా మరమ్మతులు చేయకుండా చోద్యం చూస్తుండగా, ఈ సీజన్ ఎండుడేనా..? అని పరీవాహక రైతాంగం ఆందోళన చెందు తున్నది. ఇప్పటికైనా నీటి పారుదల శాఖ యంత్రాంగం స్పందించాలని కోరుతున్నది.