మెట్పల్లి, ఆగస్టు 10: మద్యం, జల్సాలకు అలవాటుపడి బైక్ చోరీలకు అలవాటు పడ్డాడు. ఒకటి రెండు కాదు, ఏకంగా 20 బైక్‌లు ఎత్తుకెళ్లాడు. శనివారం తనిఖీలు చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. మెట్పల్లి పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అశోక్‌కుమార్ వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల గ్రామానికి చెందిన మన్నే లక్ష్మణ్ గతంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు.
ఓ ప్రమాదంలో కాలు విరగడంతో డ్రైవర్ పని మానేశాడు. ఈ క్రమంలో మద్యం, జల్సాలకు అలవాటుపడ్డాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో హోటళ్లు, బస్టాండ్లు, దవాఖానలు, దుకాణాల ఎదుట హ్యాండిల్ లాక్ చేయకుండా పార్కింగ్ చేసిన బైకులే లక్ష్యంగా అపహరించుకువెళ్లడం మొదలు పెట్టాడు.
ఇలా ఏడాది కాలంలో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 20 బైకులను ఎత్తుకెళ్లాడు. బైక్‌లను నిర్మల్ జిల్లా మామడ మండలం పొనకల్ గ్రామానికి చెందిన చికెన్ సెంటర్ నిర్వాహకుడు మహ్మద్ మోసిన్, బైక్ మెకానిక్ షాపు నిర్వాహకుడు అబ్దుల్ రషీద్‌కు ఒక్కో వాహనాన్ని 8 వేల నుంచి 10 వేల చొప్పున విక్రయించేవాడు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు.
కొద్ది రోజులుగా బైక్‌ల చోరీపై బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్రావు పర్యవేక్షణలో సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి బైక్ దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని వెంకట్రావుపేట శివారులో జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌పై అనుమానాస్పదంగా వస్తున్న వ్యక్తిని పట్టుకుని విచారించారు.
బైక్‌ల చోరీకి పాల్పడినట్టు అంగీకరించడంతో పాటు ఇచ్చిన సమాచారంతో బైక్‌లు కొనుగోలు చేసిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 20 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న మెట్పల్లి సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్ఐ చిరంజీవి, కానిస్టేబుళ్లు కిరణ్, సంతోష్‌ను ఎస్పీ అభినందించి, నగదు రివార్డులను అందజేశారు.