మెట్పల్లి రూరల్, ఆగస్టు 10: ఘనమైన చరిత్ర కలిగిన పెద్దాపూర్ బాలుర గురుకులంలో ఇద్దరి ప్రాణాలు పోతే గానీ అధికారులు తేరుకోలేదు. వరుస ఘటనలు జరిగితే గానీ రక్షణ చర్యలు చేపట్టాలన్న విషయం గుర్తుకురాలేదు. గత నెల 26న ఓ విద్యార్థి మృతి చెందగా, అస్వస్థతకు గురైన మరో ఇద్దరు విద్యార్థులు చికిత్స తర్వాత కోలుకున్నారు.
ఈ నెల 9న మరో విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతతో నిజామాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. మొదటి ఘటన తర్వాత ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసి, పాత భవనంలోని విద్యార్థులకు అసంపూర్తిగా ఉన్న కొత్త భవనంలో తాత్కాలిక వసతి కల్పించి అధికారులు చేతులు దులుపుకున్నారు. తిరిగి రెండో ఘటనలో మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల ఆగ్రహానికి గురైన ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పుడు తేరుకొని కొత్త భవనాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు పూనుకున్నారు.
కోరుట్ల మున్సిపాలిటీతోపాటు వెల్లుల్ల, చౌలమద్ది, పెద్దాపూర్ గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బందితో గురుకుల పాఠశాల ఆవరణ చదును చేయిస్తున్నారు. ఎక్స్‌వేటర్లు, ట్రాక్టర్ల సహాయంతో పనులు చకచకా చేపడుతున్నారు. పిచ్చిమొక్కలు, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న రెండు రేకుల షెడ్ల భవనాలను పూర్తిగా నేలమట్టం చేశారు. కొత్త భవనం వెనకాల ఉన్న పాడుబడ్డ బావిని పూడ్చివేయిస్తున్నారు.
ఇటు తాత్కాలిక వసతి కల్పించిన కొత్త భవనంలో అసంపూర్తిగా ఉన్న పనులను చేపడుతున్నారు. ప్రధానంగా విద్యుత్, ప్లంబింగ్ పెండింగ్‌లో ఉండగా, ముందుగా గదుల్లో విద్యుత్ పనులు చేపడుతున్నారు. సీలింగ్ ఫ్యాన్లు, బల్బులు బిగిస్తున్నారు. అలాగే, ప్లంబింగ్ పనులు ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, స్నానపు గదులను ఉపయోగించేందుకు చర్యలు చేపట్టారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గౌతమ్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఆవరణలో పారిశుధ్య పనులు, కొత్త భవనంలో అసంపూర్తి పనులు పూర్తిచేసేందుకు దాదాపు ఏడు రోజులు పడుతుందని ఆయన చెప్పారు. సాధ్యమైనంత తొందరగా పనులను పూర్తిచేసి ఈ నెల 15న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, 16 నుంచి కొత్త భవనంలో తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
బయటపడుతున్న పాములు
పిచ్చి చెట్లు, ముళ్లపొదలను తొలగించడం, శిథిల భవనాలను కూల్చివేయడం, పాడుబడిన బావి, మురికి కుంటను పూడ్చే క్రమంలో పాములు బయటకు వస్తున్నాయి. శనివారం నాలుగు పాములు కనిపించాయి. వాటిని ఎక్స్కవేటర్లతో చంపేశారు. ఇంకా వారం రోజులపాటు పనులు చేయనుండగా, మరిన్ని పాములు బయటకు రావొచ్చని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచాలని, అప్పుడే పాముల సంచారం తగ్గుతుందని చెబుతున్నారు.