Gangaram | కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 5 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామ శివారు హుస్సెన్మియా వాగులో ఆదివారం క్షుద్ర పూజల కళకళలం సృష్టించాయి. మనుష్యుల మధ్య ఉన్న మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని కొంత మంది పట్టపగలే క్షుద్రపూజలకు తెరలేపారు. సమాచారమందుకున్న పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
సంఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం హుస్సేన్మియా వాగు ఒడ్డున ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొంత మంది సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిర్మానుశ్యంగా ఉన్న వాగును మంత్రాలు, యంత్రాలు చేసేందుకు ఎంచుకున్నారు. వాగును అడ్డగా చేసుకొని వింత బొమ్మలు, నిమ్మకాయలు, గుమ్మడికాయ, తాయత్తులు, దండలు, జీడిగింజలు తదితర వస్తువులతో మంత్రాలు, యంత్రాలు నిర్వహిస్తున్నారు. పట్టపగలే జరుగుతున్న ఈ సంఘటనను చూసిన స్థానికులు భయాందోళనకు చెంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మంత్రాలు నిర్వహిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
సంఘటనా స్థలంలో క్షుద్రపూజలకు ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. మూఢనమ్మకాల పేరుతో అమాయకులను భయబ్రాంతులకు గురి చేస్తున్న వారిని చట్టపరంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో ఇక్కడే కొంత మంది ముఠా క్షుద్ర పూజలు నిర్వహించి ఒకరిని హత్య చేశారని, మళ్లీ ఇదే సంఘటన పునరావృతం కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయమై ఎస్సై వెంకటేశ్ ను వివరణ కోరగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.