NPDCL | ముకరంపుర, ఆగస్టు 19: విద్యుత్ స్తంభాలకు అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్ వైర్లను నిర్వాహకులు నిర్దేశించిన విధంగా సరిచేసుకోనట్లయితే తొలగించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఎస్ఈలను ఆదేశించారు. హన్మకొండలోని విద్యుత్ భవన్ నుంచి అన్ని సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, డీఈ(టెక్నీకల్)లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ స్తంభాలకు అస్తవ్యస్తంగా వేలాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్న కేబుల్ వైర్లను నిర్వాహకులు సరిచేయకుంటే తొలగించాలన్నారు. వినాయక చవితి, దుర్గామాత నవరాత్రోత్సవాల సందర్బంగా తయారీ కేంద్రాల నుంచి మండపాలకు
ఎత్తయిన విగ్రహాల తరలింపు, నిమజ్జన శోభాయాత్రలో ఇబ్బందులు లేకుండా లైన్ల క్లియరెన్స్ చేపట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వినాయక నిమజ్జన రూట్లను ముందస్తుగా తనిఖీ చేసి క్లియరెన్స్ ఉండేలా ఇప్పటి నుంచే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులకు విద్యుత్ విషయంలో జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. క్షేత్ర స్థాయిలో సమష్టిగా సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.