కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 10 : కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ల జాతర సోమవారం ముగిసింది. చివరి రోజూ హోరెత్తింది. సోమవారం గ్రాడ్యుయేట్ స్థానానికి 51 మంది, టీచర్ స్థానానికి 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా, శని, ఆదివారాలు మినహా ప్రతి రోజూ నామినేషన్లు స్వీకరించారు.
సోమవారం వరకు గ్రాడ్యుయేట్ స్థానానికి 100, టీచర్స్ స్థానానికి 17 నామినేషన్లు వచ్చినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం నామినేషన్లను పరిశీలించనున్నారు. 13వ తేదీ సాయంత్రం వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదే రోజు బరిలో నిలిచెవరో తేలనున్నది. కాగా, నామినేషన్ల దాఖలుకు సోమవారమే తుదిగడువు కాగా, పలు ప్రాంతాల నుంచి వందలాది మంది అనుచరులతో తరలివచ్చి నామినేషన్ల దాఖలు చేశారు.