Korutla MLA Dr. Sanjay | జగిత్యాల టౌన్ : సీఎం రేవంత్ రెడ్డి వద్ద సరుకు లేదు.. సబ్జెక్టు లేదు.. నోరు తెరిస్తే అంతా బూతు పురాణాలే అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు కోట్ల కోట్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ 11 పర్యాయాలు కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతుబంధు ఇచ్చి ఆదుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అంత చేసినా ఏ ఒక్కరోజు రూ.100 కోట్లు పెట్టి సంబరాలు చేయలేదన్నారు.
ఈ ముఖ్యమంత్రి సంబరాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో 511 మంది రైతులను పొట్టన పెట్టుకున్నందుకా, ఇప్పటివరకు రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టినందుకా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు రైతులకు ఎకరాకు రూ.15000 ఇస్తానని చెప్పి రూ.12 వేలకు కుదించి నందుకా ఈ సంబరాలు అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చారాణా మందికి చేసి బారాణా మందికి ఎగ్గొట్టినందుకా, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా, కౌలు రైతులకు భూస్వాములకు సమానంగా డబ్బులు ఇస్తానని చెప్పి మోసం చేసినందుకా ఈ సంబరాలు అని మండిపడ్డారు.
ఎలక్షన్లకు ముందు రైతులకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తానని వాగ్ధానం చేసి చివరికి సన్నవడ్లకు ఇస్తానని చెప్పి చేతులెత్తేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. 420 వాగ్దానాలు ఇచ్చి ఇప్పటివరకు ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయినా ఇప్పటివరకు ఒక్క చెక్‌డ్యాం కూడా కట్టిన దాఖలాలు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క పిల్లను కూలిపోతే ఇప్పటివరకు దాన్నిమరమ్మతు చేయలేదన్నారు. ఆయన గురువైన చంద్రబాబుకు గోదారినీలను వదిలేసినందుకు సంబరాలు జరుపుకుంటున్నారని రైతులు అంటున్నారన్నారు.
ఎలక్షన్లకు ముందు రైతులను మభ్యపెట్టి నిండా ముంచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు, రైతు రుణమాఫీ, 24 గంటల కరెంటు, మిషన్ భగీరథ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి రైతుల కళ్ళల్లో ఆనందం నింపిన గొప్ప వ్యక్తి అన్నారు. మా కోరుట్ల నియోజకవర్గంలో 50 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన పట్టించుకునే దిక్కులేరన్నారు. కనీసం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలనైన నడపలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. గోదావరి నీళ్లను చంద్రబాబుకు గురుదక్షిణగా ఇచ్చి నందుకు ఈ సంబరాలు నిర్వహించుకుంటున్నారని, రైతులు మిమ్మల్ని చీ కొడుతున్నారని అన్నారు.
సంబరాలు అంటే ప్రజలందరూ ఆనందపడేలా చేసుకోవాలని, కానీ అదే సంబరాలు బూతు పురాణం తప్ప మరేది లేదని అన్నారు. బనకచర్ల పై అసెంబ్లీలో చర్చించి కేసీఆర్ పై చాలెంజ్ విసిరారు. ఇప్పటివరకు ఈ క్యాబినెట్ మంత్రులకు, ముఖ్యమంత్రికి ఆ బనకచర్ల ఎక్కడ ఉందో తెలియదు అన్నారూ. ఒక మంత్రి బనకచర్లను బంక చర్లా అని మాట్లాడుతున్నాడు ఇట్లాంటి వ్యక్తులతో కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రావాలని సవాళ్లు విసురుతున్నా రన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కెసిఆర్ కాలేశ్వరం లాంటి ప్రాజెక్టును నిర్మించాలన్నారు.
ఈ ప్రాజెక్టుతో భవిష్యత్తు కాలంలో 100 సంవత్సరాల వరకు ఎటువంటి కరువు రాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోవడంతో పాటు రైతులను నిండా ముంచిందన్నారు. దీనికిగాను సీఎం ఒకసారి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావవసంత సురేష్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.