కరీంనగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు వచ్చాయి. పల్లెపల్లెనా పండుగ వాతావరణంలో కొలువు దీరాయి. ఇటీవల మూడు విడుతల వారీగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డుసభ్యులు, ఎన్నికైన ఉపసర్పంచులతో సోమవారం సమావేశాలు నిర్వహించారు. వీటిని నిర్వహించే బాధ్యతలను ఎంపీడీలు, ప్రత్యేక అధికారులకు అప్పగించారు. ఈ సమావేశాల్లోనే సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం సర్పంచులకు పదవీ బాధ్యతలు అప్పగించారు. డిసెంబర్ 22 నుంచి ఐదేళ్లపాటు ఈ పాలక వర్గాలు అధికారంలో ఉంటాయి. అనేక పంచాయతీల్లో పండుగ వాతావరణంలో కొత్త పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేశాయి. కొన్ని గ్రామ పంచాయతీల వద్ద సర్పంచులు సొంత ఖర్చులతో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారాలకు గ్రామస్తులను కూడా ఆహ్వానించారు. కొన్ని గ్రామాల్లో జరిగిన ప్రమాణ స్వీకారాలకు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులు కూడా హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం గుర్తుండి పోయేలా పలువురు సర్పంచులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. జిల్లాలోని మానకొండూర్ మండలం నిజాయితీగూడెం సర్పంచ్ బొల్ల సరితతోపాటు నలుగురు వార్డు సభ్యులు, తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్లో సర్పంచ్ రాంకిషన్ మినహా అన్ని గ్రామాల్లో ప్రమాణ స్వీకారాలు పూర్తి చేశారు.