..ఈ ఫొటోలు ఎక్కడో మూరుమూల ప్రాంతాల్లోనివి కాదు, సాక్షాత్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోనివి. పర్మిట్ రూం పేరిట నడుస్తున్న దందాలకు నిలువెత్తు నిదర్శనాలివి. నిజానికి పర్మిట్ రూంకు కేవలం 10×10 అంటే.. వంద స్కేర్ ఫీట్స్ (వంద చదరపు అడుగులు) మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ, ఇక్కడ దాదాపు 10 నుంచి 15 గుంటల స్థలంలో అంటే.. ఇంచుమించు మూడు నుంచి ఐదు వేల చదరపు అడుగుల్లో నడుస్తున్నది. ఇది ఒకటి రెండు వైన్స్‌లకు మాత్రమే పరిమితం కాలేదు. ఇలా ఒక్క కరీంనగర్ టౌన్లోనే పది నుంచి పన్నెండు ప్రాంతాల్లో యథేచ్ఛగా నడుస్తున్నవి. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే లెక్కేలేదు. ఇంత బాహాటంగా దందా జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ ఎందుకు కళ్లు మూసుకున్నది? క్వాలిటీ లేని తిను బండారాలు అందిస్తూ ప్రజలను అనారోగ్యాల పాలు జేస్తున్నా.. సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? జిల్లా కేంద్రాల్లో.. అది కూడా ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు కూతవేటు దూరంలో పర్మిట్ రూంలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా తనిఖీలు ఎందుకు చేయడం లేదు? కనీసం నోటీసులు ఇచ్చి జరిమానా కూడా విధించే దిశగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పాలి. ఈ దందాలను లోతుగా పరిశీలిస్తే.. మామూళ్ల మత్తే కారణమని తెలుస్తుండగా.. ఇదే అదనుగా కొంతమంది పర్మిట్ రూంల నిర్వాహకులు రెచ్చిపోతున్నట్టు స్పష్టమవుతున్నది. నెలనెలా ముడుపులు రావడం వల్లే కొంత మంది అధికారులు అడ్డు చెప్పడం లేదన్న ఆరోపణలు వస్తుండగా, దీని వల్ల నిబంధనల ప్రకారం నడుపుతున్న పర్మిట్ రూం నిర్వాహకులు సైతం ఇబ్బందులకు లోనవుతున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూంల దందా రోజురోజుకూ విస్తరిస్తున్నది. అడ్డూఅదుపు లేకుండా విచ్చలవిడిగా సాగుతున్నది. అయితే ఎక్సైజ్ శాఖలోని కొంత మంది అధికారులే అండదండలు అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకోసం నెలా నెలా సదరు వ్యాపారుల నుంచి మామూళ్లు పుచ్చుకుంటూ అడ్డు చెప్పడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సదరు పర్మిట్‌రూంల నిర్వాహకులు యథేచ్ఛగా అక్రమ దందాను నడుపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దందాలపై ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 7న ‘మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌శాఖ?’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లాకేంద్రంలో కొంతమంది పర్మిట్ రూం నిర్వాహకులు దందాలు నడపడం, నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలు విక్రయించడం, తద్వారా జరుగుతున్న పరిణామాలు, యువత పక్కదారి పట్టడం, ఎక్సైజ్ అధికారుల ఉదాసీన వైఖరి.. వంటి అంశాలను ఎత్తిచూపిన విషయం విదితమే. ఆధారాల కోసం వేల చదరపు అడుగుల్లో నడుస్తున్న ఫొటోలను ప్రచురించిన విషయం తెలిసిందే. విచిత్రం ఏమిటంటే.. ఆధారాలతో సహా బయట పెట్టి నా నేటి వరకు ఎక్సైజ్ శాఖ.. సదరు నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంతేకాదు, పర్మిట్ రూం పేరిట వేలాది చదరపు అడుగుల్లో కుర్చీలు, టేబుళ్లు వేసి, విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నా కనీసం చర్యలు తీసుకునే ప్ర యత్నాలు చేయలేదు. దీనినిబట్టి ఎక్సైజ్‌శాఖ పనితీరు ఎలా ఉ న్నదో అర్థం చేసుకోవచ్చు. దీని వెనుక జరుగుతున్న మామూళ్ల తతంగం ఎంతలా ప్రభావం చూపుతున్నదో తెలుస్తున్నది.
ఎక్సైజ్ అధికారులు తరచుగా వైన్స్‌లు, పర్మిట్ రూంలను తనిఖీ చేయాలి. అక్కడ అన్ని నిబంధనల ప్రకారం ఉన్నాయా.. లేదా? చూడాలి. అందుకు సంబంధించిన రిజిస్టర్లు నిర్వహిస్తున్నారా.. లేదా? లేదా పరిశీలించాలి. నిబంధనలకు విరుద్ధంగా ఏ ఒక్క ఆధారం లభించినా సదరు వైన్స్‌ను, పర్మిట్ రూంను సీజ్ చేయాలి. అలాగే భారీ జరిమానా విధించాలి. కానీ, ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు ఇవేవి చేస్తున్నట్టు కనిపించడం లేదు. నాటుసారా, గుడుంబా లాంటి చిన్న వ్యాపారులపై దాడులు చేసి, ప్రచారం కోసం పత్రికలకు ఫొటోలతో సహా ప్రెస్నోట్లు విడుదల చేసే అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పర్మిట్ రూంలు, బార్ అండ్ రెస్టారెంట్లపై దాడులు చేసి, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంటే ఎక్సైజ్ అధికారుల దృష్టిలో అన్ని సవ్యంగా నడుస్తున్నాయనే భావన కనిపిస్తున్నది. నిజానికి అధికారుల నిర్లక్ష్యం వల్ల మద్యం ఏరులై పారుతున్నది. ప్రధానంగా పర్మిట్రూంలపై కంట్రోల్ లేకపోవడం అవినీతికి అద్దం పడుతున్నది. ఒక్క కరీంనగర్ జిల్లాకేంద్రంలో తీసుకుంటే.. దాదాపు పది ప్రాంతాల్లో వేలాది చదరపు అడుగుల్లో పర్మిట్ రూంలు నడుపుతున్నారంటే.. వాటికి అధికారుల అండదండలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా అధికారులు ఒక్కసారి దాడి చేస్తే మెజార్టీ పర్మిట్‌రూంల పరిధిలో కండ్లు బైర్లు కమ్మే నిజాలు బయట పడుతాయి. కానీ, తనిఖీలు చేసే విషయాన్ని విస్మరిస్తున్నార్న విమర్శలు వస్తున్నాయి. కారణం ఏమిటంటే కొంత మంది అధికారులే ఈ అక్రమ దందాను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా చిన్న స్థాయి అధికారులు వెళ్తే.. వెంటనే సదరు వ్యాపారి నుంచి నేరుగా పై స్థాయి అధికారులకు ఫోన్లు వెళ్తున్నాయి. ఇటీవల జరిగిన పలు సంఘటనలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక్కసారి లోతుగా చూస్తే.. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో తయారయ్యే గుడుంబా, నాటుసారా వంటి వాటిని పసిగట్టి వాటిపై దాడులు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు.. కండ్లముందే, అది కూడా కూతవేటు దూరంలో పర్మిట్‌రూంల పేరిట విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలు కనిపించడం లేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి ఈ తంతంగం కానిస్టేబుల్ నుంచి మొదలు కొని పైస్థాయి అధికారి వరకు తెలిసినా.. ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తున్నది. దీనికి వెనుక పెద్ద ఎత్తున మామూళ్లు చేతులు మారడమేనన్న చర్చ ప్రస్తుతం ఆ శాఖలోనే నడుస్తున్నది.
కొంత మంది పర్మిట్రూం నిర్వాహకులు తమ స్వప్రయోజనాల కోసం చేస్తున్న దందాలు మద్యం ప్రియుల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నాయి. నిజానికి పర్మిట్ రూంల్లో కేవలం చిన్న కారా, పాప్‌కార్న్, చిప్స్ లాంటివి తప్ప.. మటన్, చికెన్, బిర్యాణి లాంటి పదార్థాలు విక్రయించడానికి వీలు లేదు. కానీ, కొన్ని పర్మిట్ రూంల్లో చూస్తే బార్ అండ్ రెస్టారెంట్ల కన్నా ఎక్కువ మెనూ ఉంటున్నది. కొన్ని పర్మిట్ రూంల్లో 20 నుంచి 30 రకాలకుపైగా నాన్‌వెజ్ ఐటమ్స్ అందిస్తున్నారంటే, వారి వ్యాపారం ఎలా సాగుతున్నదో అర్థం చేసుకోచ్చు. నిబంధనల ప్రకారం పర్మిట్ రూంలో కిచెన్ ఉండరాదు. కానీ, మెజార్టీ పర్మిట్‌రూంల పరిధిలో కిచెన్లు పెట్టడమే కాదు, అందులో నానా రకాల వంటలు చేస్తూ మద్యం ప్రియులకు వడ్డిస్తున్నారు. అయితే బార్ అండ్రెస్టారెంట్లతో పోలిస్తే ఇక్కడ ఫుడ్ క్వాలిటీ తక్కువగా ఉంటుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదొక్కటే కాదు, మద్యం విచ్చలవిడిగా లభ్యం కావడం, అందులోనూ సిట్టింగ్‌కు వీలుగా ఏర్పాట్లు ఉండటం, బార్ అండ్ రెస్టారెంట్లతో పోలిస్తే మద్యం కొంత చౌకగా దొరకడం వల్ల యువత కూడా ఇక్కడ మద్యం తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. విద్యాసంస్థలు నడిచే సమయాల్లోనూ.. 21 సంవత్సరాలలోపు వయసున్న వారు చాలా మంది ఈ పర్మిట్ రూంలో మద్యం తాగుతూ కనిపిస్తున్నారు. ఇంతలా జరుగుతున్న పర్మిట్రూం దందాలకు అధికారులు ఇకనైనా అడ్డుకట్ట వేస్తారా.. లేక చూసీ చూడనట్టు వ్యవహరిస్తారా..? అన్నది మున్ముందు తేలనున్నది.