సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 12: స్వచ్ఛతలో సిరిసిల్ల మున్సిపాలిటీకి జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నదని మున్సిపల్ కమిసనర్ వెల్దండి సమ్మయ్య పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం స్వచ్ఛ సర్వేక్షణ్-2023, సఫాయిమిత్ర సురక్ష కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని 38వ వార్డులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సిరిసిల్లను స్వచ్ఛతలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ యం త్రాంగం అహర్నిశలు శ్రమిస్తున్నదని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరుగుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజూ ట్రాక్టర్లు, ఆటోల ద్వారా ఇండ్లు, రోడ్ల వెంట ఏర్పాటు చేసిన చెత్త కుండీల్లో వేసిన చెత్తను సేకరిస్తున్నామని తెలిపారు.
ప్రజలు బాధ్యతగా తమ ఇండ్లలోని వ్యర్థాలను తడి, పొడిగా వేరుచేసి ఇంటి ముందుకు వచ్చిన వాహనాలకు అందించాలని సూచించారు. రోడ్లపై చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉండేలా బాధ్యతగా చూసుకోవాలన్నారు. సెప్టిక్ ట్యాంకులను మూడేండ్లకోసారి శుభ్రం చేసుకోవాలని తెలిపారు. మున్సిపల్ ఆధ్వర్యంలో చేపడుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో ప్రజలందరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం వార్డు పరిధిలో తడి, పొడి చెత్తను వేరుచేసి క్రమంతప్పకుండా మున్సిపల్ వాహనాలకు అందిస్తున్న ఇద్దరు మహిళలను సన్మానించారు. ఇక్కడ కౌన్సిల ర్ గూడూరి భాస్కర్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ రఘు ఉన్నారు.