వెల్గటూర్, మార్చి 10: ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే రైతన్నలను అరిగోసపెడుతున్నరు. సాగుకు నీరందించకుండా పంటలు ఎండబెడుతున్నరు. ఇది కాంగ్రెస్ తెచ్చి కరువు. వాళ్లకు అధికార యావ తప్ప రైతులపై ప్రేమ లేదని’ మాజీ మంత్రి, పెద్దపల్లి లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఎండపెల్లి మండలం మారేడుపల్లి, ముంజంపల్లి గ్రామాల్లో ‘ఎండుతున్న పంటలు’ అనే శీర్షికతో నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనాన్ని చూసి చలించిపోయారు. ఆదివారం జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, స్థానిక రైతులతో కలిసి ఆయా గ్రామాలకు వెళ్లి పొలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులు కొప్పుల వద్దకు వచ్చి పంట పొలాలను చూపించుకుంటూ గోడు వెల్లబోసుకున్నారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు మంచిగుందని, కేసీఆర్ సార్, మీరు పదవిలో ఉన్నప్పుడు మాకు ఏ రంది లేదని, పంటలకు పుష్కలంగా నీరందించి కాపాడారని గుర్తుచేసుకున్నారు. కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులకు చెప్పుకుంటే పట్టించుకోవడం లేదని, మీరే దిక్కంటూ..? కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ 500 ఏండ్లలో సగటున కురియనంత వర్షం గతేడాది తెలంగాణలో కురిసిందని, ఎటు చూసినా నీళ్లు కనిపించాయని, ఇప్పుడు ఎటు చూసినా నీళ్లు లేక నెర్రెలు తెరిచిన పొలాలు కనిపిస్తున్నాయన్నారు. నీటిని ఒడిసిపట్టి, పొలాలను తడపాలన్న విషయాన్ని కాంగ్రెస్ ఆలోచించకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందన్నారు.
ఎస్సారెస్పీ పంప్ హౌస్ ద్వారా నీళ్లు వస్తాయని గంపెడాశలతో దాదాపు 820 మంది రైతులు ముంజంపల్లి, మారేడుపల్లి గ్రామ పరిధిలో 1800 ఎకరాల్లో వరి సాగు చేశారన్నారు. పొట్ట దశలో సాగు నీరందకపోవడంతో పొలాలన్నీ ఎండిపోయాయన్నారు. ఇప్పటికే 100 మంది రైతులకు చెందిన 300 ఎకరాల వరి పనికిరాకుండా పోయిందన్నారు. నీళ్లడిగితే కేసులు పెడతామంటారా? ఎంత ధైర్యమని ధ్వజమెత్తారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే వేంనూర్ పంప్‌హౌస్ నుంచి నీటిని విడుదల చేయాలని, నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే రైతు ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ పంట పొలాల్లో ఉండాల్సిన నీరు రైతు కండ్లల్లో తిరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు.
నాకు ముంజంపల్లిలో ఏడెకరాల భూమి ఉంది. ఎప్పుడూ మొత్తం భూమిల పంట వేస్త. కానీ నీళ్ల మీద నమ్మకం లేక ఈ యాసంగిల ఎకరంన్నరల మక్కపెట్టిన. మిగిలినది బీడుపెట్టిన. ఏసిన కొద్ది మక్కకు కూడా బావిలో నీళ్లు ఎల్లుతలేవు. కనీసం పశువులకు తాగడానికి నీళ్లు పెట్టే పరిస్థితి లేదు. వెంటనే వేంనూర్ పంప్‌హౌస్ నుంచి నీటిని విడుదల చేయకపోతే ఉన్న పంటలన్నీ ఎండుతయి.
– పందిల్ల రాజేందర్‌రెడ్డి, రైతు, ముంజంపల్లి.
మాది మారేడుపల్లి. ఊళ్లే నాకు మూడెకరాల భూమి ఉంది. మొత్తం వరి పెట్టిన. బావిలో నీరు అడుగంటిపోయింది. కాలువ నీళ్లు వస్తయనుకుంటే చుక్క కూడా రాలే. వేసుకున్న పంట మొత్తం ఎండిపోయింది. పదేండ్లల్లో ఇలాంటి కరువు ఏనాడూ చూడలే. ఈ యేడు రైతు బంధు కూడా రాలె. ప్రభుత్వం ఆదుకోవాలి.
– బేతు మల్లేశం రైతు, మారేడుపల్లి.