కరీంనగర్-మెదక్, నిజామాబాద్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు ప్రచారాన్ని కూడా ప్రారంభించి ఓట్లను సైతం అభ్యర్థిస్తున్నారు. మరోవైపు ప్రధానపార్టీలు సైతం తమ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సమాలోచనలు చేస్తున్న క్రమంలో, ఆయా పార్టీల పెద్దల మద్దతు కోసం పలువురు ప్రణాళికాబద్ధంగా పావులు కదుపుతున్నారు. వచ్చేనెల ఒకటి నుంచి ఎన్రోల్మెంట్ ప్రారంభమవుతుండగా, ఆ లోపే చాలా మంది ఔత్సాహిక అభ్యర్థులు నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కలియ తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది పోటీ పడగా, ఈ సారి ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తున్నది. అంతేకాదు ఓటర్ల సంఖ్య 2.5 లక్షలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తుండగా, ఈ సారి ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రుల గెలుపు కూడా అంత సునాయాసంగా ఉండదనే మాట వినిపిస్తున్నది. ఇదిలా ఉంటే ఆగం కావద్దని, ఆచితూచీ ఓటువేయాలన్న చర్చ పట్టభద్రుల్లో జోరుగా సాగుతున్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ సారి కరీంనగర్-మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అతి త్వరలో జరుగనున్నాయి. ఈసారి పోటాపోటీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 మార్చిలో పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగగా, 17 మంది పోటీ పడ్డారు. అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన టీ జీవన్‌రెడ్డి విజయం సాధించి, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. జీవన్‌రెడ్డి పదవీ కాలం వచ్చే మార్చి 29తో ముగియనున్నది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల ఒకటి నుంచి ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల చివరి వారంలో వెలువరించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. నోటిఫికేషన్ రాగానే ఎన్రోల్మెంట్ ప్రక్రియ మొదలు కానుండగా, అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
గత ఎన్నికల్లో 17 మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. ఈ సారి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నిలబడే అవకాశాలు ఉండగా, మరోవైపు ప్రధాన పార్టీల మద్దతు కోసం మెజార్టీ అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ మద్దతు కోసం ఆశావహులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం చూస్తే మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బీఎన్‌రావు పాండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ బీఎన్‌రావు, ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరు ప్రచారం కూడా ప్రారంభించారు. రవీందర్‌సింగ్ రూపాయికే ప్రతి పట్టభద్రుడికి ఇన్సూరెన్స్ చేయిస్తానని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కలిసి మద్దతు కోరుతున్నారు. న్యాయవాదిగా, అలాగే రాజకీయ అనుభవజ్ఞుడిగా తనకున్న అనుభవాన్ని వినియోగించి పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. నాలుగు జిల్లాల్లో వివిధ సంఘాల నాయకులను కలుస్తున్నారు. టార్గెట్ ఎమ్మెల్సీ పేరిట వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. బీఎన్‌రావు ఉమ్మడి నాలుగు జిల్లాల్లో వైద్యరంగానికి సంబంధించి ఉన్న అన్ని సంఘాల మద్దతు కోరుతున్నారు. మరోవైపు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయా వర్గాలతో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పెద్దల మద్దతు కోరుతూనే ఇంటలెక్చువల్ పేరుతో వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి తన అభిప్రాయాలు షేర్ చేస్తూ సూచనలు, సలహాలు తీసుకుంటూ మద్దతు కూడగడుతున్నారు. పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గళమెత్తడానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు ప్రైవేట్ విద్యాసంస్థల మద్దతు కోరుతున్నారు. తాను గెలిస్తే విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని నాలుగు జిల్లాల అసోసియేషన్లను కలిసి వివరిస్తున్నారు. బీఆర్ఎస్ పెద్దల మద్దతు కోరుతూనే పలు వాట్సప్ గ్రూపులు ఏర్పాటుచేసి ప్రచారం చేస్తున్నారు.
వీరితోపాటు బీఆర్ఎస్ మద్దతు కోసం వేర్వేరు జిల్లాల నుంచి కూడా కొంత మంది ఆశావహులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎన్రోల్మెంట్ నాటికి వారి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశమున్నది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నట్లుగా వార్తలు వస్తుండగా, మున్ముందు ఈ పార్టీ నుంచి టికెట్ కోరే వారి సంఖ్య పెరిగే అవకాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పొందిన వెలిచాల రాజేందర్రావు టికెట్ అశిస్తున్న వారిలో ఉన్నారు. అందులో నరేందర్‌రెడ్డి మొదటిసారిగా బరిలోకి దిగుతున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోనూ ఆయనకు విద్యాసంస్థలు ఉండడం, అందులో పెద్ద మొత్తంలో పట్టభద్రులైన ఉద్యోగులు, యువకులు ఉండడం, అలాగే విద్యాసంస్థల నుంచి బయటకు వెళ్లిన విద్యావంతులు ఉండడం వంటి అంశాలు తనకు పాజిటివ్ అవుతుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి టికెట్ తనకే వస్తుందని, అదే పార్టీ నుంచి పోటీ చేస్తానని బుధవారం కరీంనగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అంతేకాదు ఇప్పటికే ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించి వివిధ వర్గాలను కలుస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వెలిచాల రాజేందర్రావు తన పూర్తి సమయాన్ని రాజకీయాల కోసం వెచ్చిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక కార్యాలయాలన్ని తీసుకొని తన కార్యకలాపాలను నడుపుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాహాటంగా బయట పడకపోయినా అంతర్గతంగా మాత్రం టికెట్ తనకే వస్తుందన్న ధీమాను తన సన్నిహితులతో వ్యక్తం చేయడమేకాకుండా, తనదైన శైలిలో తన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇక బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు పొల్సాని సుగుణాకర్‌రావు, మరో సీనియర్ నాయకురాలు రాణి రుద్రమ, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే రఘునాథ్ ఆ పార్టీ పెద్దలను కలిసి టికెట్ ఇవ్వాలని కోరారు. ఇలా ఎవరికి వారే తమకు అవకాశం కల్పించాలని అధిష్టానానికి దరఖాస్తు ఇవ్వడంతో పాటు ఎవరి మార్గాల్లో వారు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలుస్తున్నది. కాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకుల్లో పలువురు ఇప్పటికే వారి వారి ప్రచారాలను ప్రారంభించగా, బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో మాత్రం ఇంకా ఆ హుషారు కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరితో పాటు పలువురు ఆయా జిల్లాల నుంచి స్వతంత్రంగా రంగంలోకి దిగేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
గతంతో పోలిస్తే ఈసారి పట్టభద్రుల ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో మొత్తం 1,96,321 ఓట్లు ఉండగా, ఈ సారి ఆ సంఖ్య 2.5 లక్షలకు పైగా చేరొచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లను అధికార యంత్రాగం చేస్తుండగా, మరోవైపు ఆశావహులైన అభ్యర్థులు వారి వారి ఆధ్వర్యంలో భారీగా ఎన్రోల్ మెంట్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. పాత జాబితాను తీసుకొని ఇప్పటికే పలువురు ప్రచారం ప్రారంభించడమే కాకుండా, సదరు ఓటర్ల నుంచి తిరిగి ఎన్రోల్మెంట్కు కావాల్సిన వివరాలు, సర్టిఫికెట్లు సేకరిస్తున్నారు. ఆ వివరాలను తీసుకొచ్చి వారి వారి పరిధిలో ఉంచుకొని, ఎన్రోల్మెంట్ ప్రారంభం కాగానే ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రత్యేకంగా కంప్యూటర్లు, అపరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈసారి పట్ట భద్రుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనాలున్నాయి. అయితే ప్రకటనలు, ప్రచారాలను చూసి కాకుండా నికార్సుగా తమ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నాయకులకే ఓటు వేయాలని పట్టభద్రులు ఆలోచిస్తున్నారు. ఏ నలుగురు పట్టభద్రులు కలిసినా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. మొత్తంగా నోటిఫికేషన్‌కు ముందే పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం ప్రారంభం కావడం, గెలుపుకోసం ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేయడం చూస్తే ఈ సారి గెలుపు అంతా సునాయం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.