కలెక్టరేట్, మార్చి 1 : కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 3న నగరంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ మొదలు కానుండగా, దీనికోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్లు కోసం ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా, ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. లెక్కింపు సిబ్బందికి అవసరమైన శిక్షణ శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు అందజేశారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. స్ట్రాంగ్ రూములో నుంచి బ్యాలెట్ బాక్సులు లెక్కింపు కేంద్రం వద్దకు తరలించేందుకు అత్యధిక మంది సిబ్బంది అవసరముండగా, వీరిని మున్సిపల్ శాఖ నుంచి వినియోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యంత పటిష్టమైన భద్రత నడుమ లెక్కింపు చేపట్టనుండగా, ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరాయంగా కొనసాగనున్నది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుండగా, పూర్తయ్యే సరికి సుదీర్ఘ సమయం తీసుకోనున్న నేపథ్యంలో మూడు షిప్టుల్లో లెక్కింపు సిబ్బంది విధులు నిర్వహించేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపడుతున్నారు.
అభ్యర్థుల వారీగా వేసిన ఓట్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు సీరియల్ నంబర్ ప్రకారం ఒకేచోట బాక్సుల్లో ఉంచాల్సి ఉండగా, ఇందుకనుగుణంగా జంబో ఫిజిషియన్ బాక్సులు ప్రత్యేకంగా తయారుచేయించి, లెక్కింపు కేంద్రానికి చేర్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కౌంటింగ్ సెంటర్లో పటిష్టమైన మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశారు. లెక్కింపును ఆయా అభ్యర్థుల లెక్కింపు ఏజెంట్లు పరిశీలించేందుకు వీలుగా టేబుళ్ల చుట్టూ ఇనుప జాలి ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్లపై వేసిన నంబర్లపై ఎలాంటి అనుమానాలున్నా వాటిని ఏజెంట్లు క్షుణ్నంగా పరిశీలించే అవకాశముంటుందని లెక్కింపు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా, లెక్కింపు కేంద్రాన్ని మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి సందర్శించారు. ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లు గమనించారు. లెక్కింపు పూర్తయ్యేవరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. లెక్కింపు కోసం తయారు చేసిన ఫిజిషియన్ బాక్సులు, సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్లు ప్రపుల్‌దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవో కే మహేశ్వర్‌తో పాటు పలువురు ఎన్నికల అధికారులు ఉన్నారు.