శాసనమండలి ఎన్నికల తుది తీర్పు నేడే వెలువడబోతున్నది. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కాబోతున్నది. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. టీచర్ ఓట్లు తక్కువగా ఉండటంతో ఫలితం నేటి రాత్రిలోగా వెలువడనుండగా, గ్రాడ్యుయేట్ ఓట్లు అధికంగా ఉండడంతో రిజల్ట్ రెండు మూడు రోజులు పట్టే అవకాశమున్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ కలెక్టరేట్ : కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 27న ఎన్నికలు నిర్వహించారు. గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గ్రాడ్యుయేట్ నియోజకర్గంలో 3,55,159 మంది ఓటర్లకు 2,50,328 మంది (70.48 శాతం), టీచర్ నియోజకవర్గంలో 27,088 మంది ఓటర్లకు 24,968 మంది (92.17 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంకు తరలించి, ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు. నేటి ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు.
పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్లు, ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు సిద్ధంగా ఉంచారు. ఈ రెండు స్థానాలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఒక్కో టేబుల్‌ను కేటాయించారు. సాధారణ ఓట్ల లెక్కింపుతో పాటు పోస్టల్ ఓట్లు కూడా లెక్కించనున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా లెక్కింపు చేపట్టనుండగా, మొదటగా ఆదిలాబాద్ జిల్లాలోని పోలింగ్ బూతుల నుంచి మొదలు పెట్టనున్నారు. ఒక్కో టేబుల్ వద్ద ఆయా అభ్యర్థికి సంబంధించిన ఒక ఏజెంట్ లెక్కింపు ప్రక్రియను గమనించేందుకు అవకాశం కల్పించారు. ఏజెంట్లను ఉదయం ఆరు గంటల నుంచే కేంద్రంలోనికి అనుమతించనున్నారు.
ఒక్కో అభ్యర్థి తరపున రిలీవర్లకు కూడా అవకాశం కల్పించారు. ఏజంట్లకు శనివారమే పాసులు జారీ చేశారు. లెక్కింపు సందర్భంగా పాటించాల్సిన నిబంధనలపై కూడా అవగాహన కల్పించారు. మరోసారి లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రిటర్నింగ్ అధికారి వివరించారు. ఆదివారం సాయంత్రంలోపే మాక్ కౌంటింగ్ పూర్తి చేశారు. ఉపాధ్యాయుల స్థానానికి సంబంధించి ఫలితం నేటి రాత్రిలోగా వెలువడే అవకాశముండగా, పట్టభద్రుల స్థానం ఫలితం మాత్రం రెండు నుంచి మూడు రోజులు పట్టొచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు
లెక్కింపు కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. అంబేద్కర్ ఇండోర్ స్టేడియం చుట్టూ మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏజెంట్లు కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకురావద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సందర్భంలో ఒక ఏజెంట్‌కు బదులు మరొకరు వెళ్లడం, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏజెంట్ రిలీవర్ను అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఏజెంట్లు తమ వెంట ఎలాంటి ఇంక్ పెన్నులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు లోనికి తీసుకురావద్దని సూచిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు.
అభ్యర్థుల్లో టెన్షన్
ఓట్ల లెక్కింపు సమయం సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు, వారి మద్దతుదారులు, ఆయా పార్టీల్లో టెన్షన్ పెరుగుతున్నది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులుగా భావిస్తున్న ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్టు తెలుస్తున్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం దక్కే సూచనలు లేకపోగా, రెండో ప్రాధాన్యత ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోన మాత్రం వణికిపోతున్నారు. టీచర్స్ రిజల్ట్ నేటి రాత్రిలోగా వెలువడే అవకాశముండగా, గ్రాడ్యుయేట్ ఫలితం మాత్రం రెండు నుంచి మూడు రోజులు పట్టొచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పోలైన ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. పట్టభద్రుల స్థానంలో పోలైన 2,50,328 బ్యాలెట్ పేపర్ల లెక్కింపు రెండు రోజుల పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.
లెక్కింపు అనంతరం ముందుగానే కోటాను నిర్ధారించి, పోలైన ఓట్ల నుంచి చెల్లని ఓట్లు తొలగించి, చెల్లుబాటయ్యే ఓట్ల లెక్క తేల్చాల్సి ఉంటుంది. మొత్తం చెల్లుబాటయ్యే ఓట్లలో యాభై శాతం లెక్క కట్టి, అంతకుమించి ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ముందుగా బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టి, అభ్యర్థులకు కేటాయించిన డబ్బాల్లో వారికి వచ్చిన ఓట్లు వేస్తారు. అనంతరం ఆయా అభ్యర్థులు సాధించిన ఓట్ల లెక్క తేలుస్తారు. మొదటి ప్రాధాన్యతలో ఏ ఒక్కరికి సగానికి పైగా ఓట్లు లభించకపోతే, ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. అందులో భాగంగా అందరికంటే తక్కువ ఓట్లు సాధించిన వ్యక్తికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. వాటిని పైనున్న అభ్యర్థులకు బదిలీ చేస్తారు. ఎలిమినేషన్ అనంతరం విజయానికి అవసరమైన ఓట్లు సాధించిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటిస్తారు. పట్టభద్రుల ఓట్లు లక్షల్లో ఉండటంతో వీటి లెక్కింపు ప్రక్రియ ఆలస్యం కానుండగా, ఫలితం వెలువడటం కూడా ఆలస్యమవుతుందని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు.
ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి : ఆర్వో
పట్టభద్రులు, ఉపాధ్యాయుల మండలి స్థానాల ఓట్ల లెక్కింపులో సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి సూచించారు. ఆదివారం ఎన్నికల అధికారులు మాక్ కౌంటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లెక్కింపులో పాల్గొనబోయే సూపర్వైజర్లు, లెక్కింపు అసిస్టెంట్లకు అవగాహన కల్పించేందుకు మాక్ కౌంటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ముందుగానే చేపట్టే ఈ ప్రక్రియ ద్వారా ఎటువంటి పొరపాట్లకు, తప్పిదాలకు ఆస్కారం లేకుండా లెక్కింపు సజావుగా సాగుతుందన్నారు. ఏవైనా సందేహాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని సూచించారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. మాక్ కౌంటింగ్‌లో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, కౌంటింగ్ సూపర్వైజర్లు, సిబ్బందికి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు విధానం, నిబంధనలు, మార్గదర్శకాలను వివరించారు. లెక్కింపు కేంద్రం ఆవరణలో మీడియా సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కే మహేశ్వర్, ఎన్నికల సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.