కరీంనగర్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ పార్టీ, క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింతగా చేరువవుతున్నది. కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నెల 12న కదనభేరి పేరిట శంఖారావం పూరించగా, మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇటు ఎంపీ అభ్యర్థులు కూడా ప్రజల మద్దతు కూడ కడుతుండగా.. హరీశ్‌రావు నేడు కరీంనగర్ వస్తున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తరఫున శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి ఇంటింటా ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ వంద రోజల పాలనలో వైఫల్యాలను, ఆరు గ్యారెంటీల పేరిట చేసిన మోసాన్ని, సాగునీరు లేక రైతులు పడుతున్న గోసలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించనున్నారు. బీజేపీ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ అభివృద్ధిని మరిచిన తీరును, ఎంపీగా ఉన్నప్పుడు వినోద్ కుమార్ చేసిన అభివృద్ధిని వివరించనున్నారు. అలాగే పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆదర్శంగా మారిన తీరును కండ్లముందుంచి, ఓట్లు అభ్యర్థిస్తారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.