మల్లాపూర్, మార్చి 29: సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల మండిపడ్డారు. శనివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏడుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, 43 మందికి రూ.8,74,812 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని బాధ్యతగా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హితవుపలికారు.
కల్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని ఉచిత హామీలు ఇచ్చారని, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు కలిస్తే తులం బంగారం ఎప్పుడు ఇస్తారని అడగాలని ప్రజలకు సూచించారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పదేండ్లలో కరోనా వంటి ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా ఏనాడూ సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తుచేశారు. ఇక్కడ మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సింగిల్‌విండో చైర్మన్ కాటిపల్లి ఆదిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, నాయకులు దేవ మల్లయ్య, ఏనుగు రాంరెడ్డి, ముద్దం శరత్, బండి లింగస్వామి, మేకల సతీశ్ పాల్గొన్నారు.