రాజన్న సిరిసిల్ల, జనవరి 16 (నమస్తే తెలంగాణ)/ముస్తాబాద్/ చందుర్తి: ‘ఒకప్పుడు పల్లెలంటే పాడుబడ్డ బావులు, పాత గోడలు, చెత్త కుప్పలు, మట్టి దిబ్బలు. తెలంగాణ వచ్చినంక పల్లె ముఖచిత్రమే మారిపోయింది. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అన్న మహాత్మాగాంధీ మాటలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాం. గ్రామ స్వరాజ్యాన్ని సాధించి ఆయన కలలు సాకారం చేసిన రాష్ట్రం మనదేనని చెప్పుకోవడం గర్వంగా ఉందని’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. నాడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడిన పల్లెలను నేడు సకల సౌకర్యాల హరివిల్లులుగా మార్చిన ఘనత మనదేనని, పల్లె కన్నీరు పెడుతుందన్న పాట ఓ ప్రభుత్వాన్నే కూల్చేసిందని గుర్తు చేశారు.
సమష్టి కృషితో సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుంచిన సర్పంచులందరికీ శిరస్సు వంచి సలాం చేస్తున్నానన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన ప్రతి పనిని సమర్థవంతంగా చేసి పల్లెకు గుర్తింపు తెచ్చినందుకు గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన సర్పంచులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. మంగళవారం సిరిసిల్ల జిల్లాలో మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్‌తో కలిసి పర్యటించారు.
ఉదయం 11.30గంటల నుంచి రాత్రి 10గంటల వరకు పర్యటించిన ఆయన, మొదట రగుడు వద్ద తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచుల ఆత్మీయ సత్కార కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం చందుర్తి మండలం మల్యాలకు చేరుకొని, కేసీఆర్ కప్ వాలీబాల్ టోర్నీని ప్రారంభించారు. తిరిగి సిరిసిల్లకు వచ్చి, పలువురిని పరామర్శించడంతోపాటు నూతన జంటలను ఆశీర్వదించారు. ఆ తర్వాత తంగళ్లపల్లిలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని దర్శించుకొని, పూ జలు చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల కేటీఆర్ మాట్లాడా రు.
పదవి నుంచి దిగిపోయే ముందు కూడా గౌరవంగా పం పించాలన్న ఉద్దేశంతో ఈ ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదవిలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా మంచి పనులు చేశారని కొనియాడారు. కేసీఆర్ ప్రభుత్వం లేదన్న విషయం ఇంకా ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియదని, తెలిసి జీర్ణించులేక పోతున్నారని పేర్కొన్నారు. జీవితమైనా, రాజకీయమైనా ఎదురు దెబ్బలు సహజమన్నారు. రాజకీయాల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించే సత్తా ఉండాలని, గోడకు తగిలిన రబ్బరు బంతిలా తప్పకుండా తిరిగి వస్తామని చెప్పారు.
కేసీఆర్ సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు 81 అవార్డులు వచ్చాయని మంత్రి తెలిపారు. అందులో 3శాతం కన్నా తక్కువ జనాభా ఉన్న తెలంగాణకు జాతీయ స్థాయిలో 35శాతం అవార్డులు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద టాప్‌టెన్‌లో పదికి పది అవార్డులు, ఇరవైలో 19 అవార్డులు తెలంగాణకే దక్కాయంటే సర్పంచుల పనితీరుకు నిదర్శమని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌లో 20, మిషన్ భగీరథకు వందకుపైగా అవార్డులు అందుకున్నది దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని చెప్పారు.
పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై మీ తరపున గొంతు విప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. దేశంలో చెక్ పవర్ ఉన్నది కేవలం సర్పంచులు, రాష్ట్రపతికి మాత్రమేనన్నారు. ఇది వీడ్కోలు సభ కాదని, మళ్లీ ఎన్నికల్లో గెలిచి వస్తారని ఆకాంక్షించారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో పల్లె పక్రృతి వనాలు, డంప్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె బృహత్ వనాలు, మంకీపుడ్కోర్టులు లేవన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నామని, ఎవరు చనిపోయినా సంస్కారవంతంగా అంత్యక్రియలు నిర్వహించుకుంటున్నామన్నారు.
కేసీఆర్ నాయకత్వంలోని మంచి ప్రభుత్వంలో పనిచేసిన సర్పంచులు అదృష్ట వంతులని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. పదవులు శాశ్వతం కాదని, మనం చేసిన పనులతో మన పేరు సమాజంలోని ప్రతి ఒక్కరి గుండె ల్లో చిరస్థాయిగా నిలిచి పోతుందని చెప్పారు. పదవీకాలం ముగుస్తున్న సర్పంచులను సన్మానించాలన్న ఆలోచన స్థానిక బీఆర్ఎస్కు రావడం గొప్ప విషయమన్నారు.
సమాజంలో గర్వించ దగ్గ పదవులంటే సర్పంచ్ మాత్రమేనని చెప్పారు. మన పిల్లల భవిష్యత్తు మంచిగుండాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. యువత చెడు అలవాట్ల వైపు వెళ్లొద్దని, క్రీడల్లో రాణించాలని కోరారు. ఒలింపిక్స్‌లో ఆడేస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ వేములవాడ ని యోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక వ్యాయామంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు తోడ్పడతాయన్నారు.