గోదావరిఖని, అక్టోబర్ 29: రామగుండం ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజలకు భరోసాఇచ్చారు. మెడికల్ కాలేజీ తెచ్చి, నియోజకవర్గాన్ని రూ. 500 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పారు. ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓటేయాలని అర్థించారు. కాంగ్రెస్ మాటలు విశ్వసిస్తే అధోగతి పాలుకాకతప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్కు విజయాన్ని కట్టబెట్టి కేసీఆర్ను మూడోసారి సీఎంను చేయాలని కోరారు. ఆదివారం గోదావరిఖని బస్టాండ్ ఏరియాలో ఎన్నికల ప్రచారం చేశారు.
సీఎం చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. తెలంగాణ భవితకు భరోసగా సబ్బండ వర్గాలు లబ్ధి చేకూరేలా బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో సీఎం కేసీఆర్ రూపొందించారని కొనియాడారు. రైతుబంధు ఎకరాకు ఏడాదికి రూ.16వేలు, తెల్లకార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పథకం, ఒక కుటుంబానికి రూ.4వేలు బీమా చెల్లించి 5 లక్షల బీమా కల్పన, సన్న బియ్యం పంపిణీ, ఆసరా పింఛన్లు 5వేలకు పెంపు, వికలాంగుల పెన్షన్లు 6వేలకు పెంపు, సౌభాగ్యలక్ష్మీ ద్వారా అర్హులైన మహిళకు నెలకు రూ.3వేలు, రూ.400లకే సిలిండర్, ఆరోగ్య శ్రీ 15లక్షలకు పెంచుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు తోకల రమేశ్, అచ్చ వేణు, సంజీవ్, పీచర శ్రీనివాస్, గంగరాజు, సట్టు శ్రీనివాస్ తదితరులున్నారు.