‘డాడీ.. ఫాదర్స్ డే రోజు మాతో సంతోషంగా గడిపితివి. మండే హాలీడే అని టెంపుల్‌కు తీసుకెళ్తివి. తిరిగి వచ్చేటప్పుడు డ్యాం చుద్దామని లోపలికి తీసుకెళ్తివి. నీటిలో పడిపోయిన నన్ను కాపాడేందుకు దూకు నువ్వు మునిగిపోతివి కదా డాడీ.. అమ్మను, నన్ను, తమ్మున్ని వదిలిపోయావా డాడీ.. రా డాడీ..’ అంటూ ఎల్ఎండీ రిజర్వాయర్‌లో మృతిచెందిన తన తండ్రి విజయ్ కుమార్‌ను తలుచుకుంటూ ఆ కూతురు సాయినిత్య గుండెలవిసేలా రోదించింది. డాడీ ఇక లేడని తెలిసి అక్కా తమ్ముళ్లు రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సోమవారం జరిగిన ఈ ఘటన ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
తిమ్మాపూర్, జూన్17: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సంతోష్‌నగర్‌లో నివాసం ఉండే బంగారి విజయ్‌కుమార్(47) కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్క్స్, ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం సెలవుదినం కావడంతో భార్య ప్రశాంతి, కూతురు సాయినిత్య, కొడుకు విక్రాంత్, అత్త పుష్పలతతో కలిసి హుస్నాబాద్‌లోని పొట్లపల్లి శివాలయానికి కారులో వెళ్లాడు. వీరంతా తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఎల్ఎండీ రిజర్వాయర్‌ను చూసేందుకు వెళ్లారు.
కట్టపై నుంచి డ్యాంలోకి దిగి లోతుగా ఉండే కాకతీయ కాలువలోకి నీళ్లు వెళ్లే ప్రాంతంలో సరదాగా గడిపారు. అంతలోనే విషాదం వెంటాడింది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న కూతురు సాయినిత్య సెల్ఫీ దిగే క్రమంలో ఒక్కసారిగా అదుపుతప్పి నీళ్లలో పడిపోయింది. వెంటనే తండ్రి విజయ్ ఒక్క ఉదుటున నీళ్లలోకి దూకి కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా, ఇద్దరూ మునిగిపోసాగారు. ఇది చూసిన పదో తరగతి చదివే కొడుకు విక్రాంత్ సైతం నీటిలోకి దూకగా.. ముగ్గురూ నీటిలో మునిగిపోసాగారు. భార్య ప్రశాంతి, ఆమె తల్లి పుష్పలత గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారుడు శంకర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే అక్కడికి వచ్చి నీటిలోకి దిగి పిల్లలు సాయినిత్య, విక్రాంత్‌ను కాపాడి గట్టుకు తీసుకువచ్చాడు.
విజయ్ కోసం గాలించగా క్షణాల్లో మునిగి గల్లంతయిపోయాడు. పిల్లలు కుటుంబసభ్యులతోపాటు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి తిమ్మాపూర్ సీఐ స్వామి, ఎల్ఎండీ ఎస్ఐ చేరాలు చేరుకున్నారు. రెస్క్యూ టీం, స్థానిక జాలర్లు పాతాలగరిగె సాయంతో గాలించారు. కొద్దిసేపటిలోనే విజయ్‌కుమార్ మృతదేహం దొరకడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కుటుంబసభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. భార్య ప్రశాంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రెప్పపాటులో బతికిన సాయినిత్య, విక్రాంత్ తమ తండ్రి గల్లంతవడంతో కూతురు, కొడుకు భయాందోళనకు గురయ్యారు. ‘డాడీ.. రా డాడీ’ అంటూ సాయినిత్య ఏడుస్తుండగా.. ‘నాన్న వస్తాడు.. నాన్నకేం కాదు’ అంటూ విక్రాంత్ రోదించిన తీరు కలిచివేసింది. కానీ, అంతలోనే విజయ్ మృతదేహం దొరకడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టింది.
ముగ్గురూ నీళ్లలో పడిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోగా, అక్కడ మత్స్యకారుడు శంకర్ లేకపోతే ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసేవి. కానీ, అరుపులు విన్న వెంటనే క్షణం ఆలోచించకుండా నీళ్లలోకి దూకి పిల్లలిద్దరినీ కాపాడాడు. పిల్లలను ఒడ్డుకు చేర్చిన అనంతరం విజయ్ను కాపాడేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు గల్లంతయ్యాడు. శంకర్‌కు మరొకరు తోడైతే విజయ్ను కాపాడే అవకాశాలుండేవి. కానీ, చాన్స్ లేకపోయింది. ప్రాణాలకు తెగించి ఇద్దరి ప్రాణాలను కాపాడిన శంకర్‌ను పోలీసులు, స్థానికులు అభినందించారు.