Rasamai Balakishan | తిమ్మాపూర్, మే24: మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంపల్లి సత్యనారాయణ ఇందిరమ్మ ఇండ్ల దందా నడిపిస్తున్నడని, రూ.50వేలు కొట్టు, ఇందిరమ్మ ఇల్లు పట్టు అన్న చందంగా కాంగ్రెస్ నాయకులు ఆఫర్ ఇస్తున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తెలిసే ఇదంతా జరుగుతున్నదా.. అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావుతో కలిసి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రసమయి బాలకిషన్ మాట్లాడారు.
ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని, గ్రామ సభ తీర్మాణం ద్వారా కలెక్టర్ లబ్ధిదారుల ఎంపిక జరగాలని జీవో ఉన్నా అది అమలు కావడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటే ఊరుకోబోమని, ఇందిరమ్మ ఇండ్ల పేరుకు బందులు కాంగ్రెస్ గృహ జ్యోతి అని పెట్టుకుంటే తాము మీ జోలికి రామని, ఇష్టం వచ్చినవారికి ఇచ్చుకోవచ్చని ఎద్దేవా చేశారు. అలాగే నియోజకవర్గంలో ఓ మండలానికి చెందిన విలేఖరి వద్ద సైతం రూ.50వేలు వసూలు చేశారని, తన దగ్గర సాక్ష్యాలున్నాయని ఆరోపించారు.
నియోజకవర్గంలో 42వేల మంది ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు వస్తే 3500మందికే ఇండ్లు ఇస్తామని అంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నిరుద్యోగ యువకు చేయూతనిచ్చేందుకు అని పెట్టిన రాజీవ్ యువవికాసం కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు చేయూతనిచ్చేందుకు పెట్టినట్టుందని ఎద్దేవా చేశారు. తాను త్వరలో ఆధారాలతోనే మాట్లాడుతున్నానని, అన్ని ఆధారాలతో సీఎం రిలీఫ్ ఫండ్ స్కాం కూడా బయటపెట్టానని గుర్తు చేశారు. దళిత నియోజకవర్గం అయినందున ప్రభుత్వం వద్ద ఎక్కువ పనులు చేయించుకోవాలని సూచన చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షాలతో పూర్తిగా రైతులు నష్టపోతున్నారని, దానిపై దృష్టి సారించాలన్నారు. కొన్ని సెంటర్లలో తూకం వేసిన సంచులు తీసుకెళ్లక చెదలు పట్టిపోతున్నాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేష్, నాయకులు కేతిరెడ్డి దేవెందర్రెడ్డి, ఏకానందం, గంప వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, బోయిని కొమురయ్య, నాయిని వెంకట్రెడ్డి, పాశం అశోక్ రెడ్డి, బోయిని తిరుపతి, గడ్డి రమేష్, సదయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.