Manthani | రామగిరి, మే 25: మంథనిలో బీసీల అణచివేతకు మంత్రి శ్రీధర్‌బాబు కుటుంబమే ప్రధాన కారణమని బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్ ఆరోపించారు. వాంకిడి నుండి అలంపూర్ వరకు చేపట్టిన బీసీల మేలుకొలుపు యాత్రలో భాగంగా ఆదివారం సెంటినరీకాలనీకి చేరుకున్న సంజయ్‌కుమార్ అంబేద్కర్-పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి పూలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… రథయాత్రలో భాగంగా తాను ఈ రోజు మంథనిలో పర్యటిస్తున్నా అని చెబితే మంథనికి వెళ్తున్నావ్ జాగ్రత్త అని హెచ్చరించారంటే మంథనిలో ఎంతటి విపత్కర పరిస్థితులున్నాయో అర్థమవుతుందన్నారు. మంథనిలో తరాలు బీసీల అణచివేతకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు కుటుంబమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. తాను మంథనికి వెళ్తే ఖచ్చితంగా మంత్రి శ్రీధర్‌బాబును కలవాలని తనకు అనేక ఫోన్‌కాల్స్, బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన ఆరోపించారు.
తాను మంత్రిని కలవాలంటే ఖచ్చితంగా కలుస్తా అని, కానీ దానికంటే ముందు ఆయన సతీమణి ప్రాతినిథ్యం వహిస్తున్న చేనేత శాఖకు సంబంధించి అనేక మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దానికి సంబంధించిన అధికారిగా ఆమె వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత పరిశ్రమ ఖాయిలా పరిశ్రమలా మారిందని, సిరిసిల్ల ఉరిసిల్లగా మారినా చేనేత మంత్రి గానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
చేనేత శాఖలో రూ.వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని ఈ విషయంపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. మేమెంతో మాకంత అనే నినాదంతో తాను వందల కిలోమీటర్లు రథయాత్ర చేపట్టానని బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన 18 హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల లాగే బీసీల రిజర్వేషన్‌ను సైతం అటకెక్కించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే రాబోయే జనరల్ ఎన్నికలలో ప్రతీ జనరల్ సీట్లో బీసీలను పోటీకి నిలిపి కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చిరించారు.
బీసీల మేలుకోలుపు యాత్ర పార్టీల కతీతంగా బీసీల అభ్యున్నతి కోసం నిర్వహిస్తున్నామని, ఎక్కడ బీసీ చట్టసభలకు పోటీ చేస్తే అక్కడ బీసీలంతా పార్టీలకతీతంగా బీసీలను గెలిపించుకోవడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం యాత్ర ముత్తారం మీదుగా కొయ్యూరు వరకు సాగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శెంకేషి రవిందర్, రైతుబంధు అధ్యక్షుడు మేదరవేని కుమార్‌యాదవ్, నాయకులు శంకర్‌లాల్, గౌతం శంకరయ్య, చెల్కల జవహర్, వేగోలపు మల్లయ్య, ధర్ముల రాజసంపత్, మేడగోని రాజన్న, గాజుల ప్రసాద్, ఆసం తిరుపతి, సైండ్ల సత్యం, దామెర శ్రీనివాస్, గద్దల శంకర్, కొండవేన ప్రభాకర్, నూనె రాజేశం, మల్యాల మోహన్, స్వామి, బొంకూరి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.