మంథని, అక్టోబర్ 2: పిల్లలకు మంచి పోషకాహారం అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘పోషణ్ మహా-24’ను తెచ్చిందని, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. మంథనిలోని శివ కిరణ్ గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించిన ‘పోషన్ మహా- 24’ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి ఆయన పాల్గొన్నారు.
గర్భిణులు, బాలింతలు, పిల్లలకు విశేష సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పుట్టిన శిశువు దగ్గరి నుంచి ఆరేండ్ల వయసు పిల్లల దాకా పోషకారం అందిస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందని చెప్పారు. జిల్లాలో ఎకడైనా అంగన్వాడీ టీచర్లు, సహయకుల పోస్టులు ఖాళీ ఉంటే వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఆరోగ్య పరిస్థితులు చెక్ చేసేందుకు మెడికల్ క్యాంపు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలు పూర్వ విద్యా కేంద్రాలుగా మారుతున్నాయని, కర దీపిక, ప్రియదర్శిని ప్రకారం పిల్లలకు ఆట పాటలతో బోధన అందించాలని సూచించారు. ఆ తర్వాత మంత్రి విలోచవరం అంగన్వాడీ సెంటర్ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిషరించారు.
అనంతరం స్వచ్ఛతా హీ సేవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంథని ఆర్డీవో హనుమా నాయక్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమ, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, సీడీపీవోలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.