తెలంగాణచౌక్, జనవరి 28 : ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మహిళలకు ఫ్రీ జర్నీతో బస్సుల్లో రద్దీ పెరిగినందున ఇప్పటికే వెయ్యి కొత్త బస్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే మరిన్ని కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ ఆర్టీసీ డిపో-2 ఆవరణలో ఆదివారం కారుణ్య పద్ధతిలో నియామకమైన వారికి ఉద్యోగ పత్రాలు అందజేశారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
మహాలక్ష్మి స్కీంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగినప్పటికీ ఓపికతో విధులు నిర్వర్తిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లను అభినందించారు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి సర్కారు కట్టుబడి ఉన్నదని, త్వరలోనే సిబ్బందికి శుభవార్త చెబుతామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న కార్పొరేషన్‌కు ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నిజామాబాద్, ఖమ్మం రీజియన్ పరిధిలో 45 మందికి కారుణ్యనియమాక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం సుచరిత, డిప్యూటీ ఆర్ఎంలు భూపతిరెడ్డి, సత్యనారాయణ, డీఎంలు మల్లేశం, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.