సిరిసిల్ల/సిరిసిల్ల రూరల్/సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 10 : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చేరుకుకొని, ఏకంగా 11 గ్రామాల్లో తిరిగారు. రాత్రి 8.20గంటలకు తిరుగు పయనమయ్యారు. 2014 తర్వాత మొదటిసారి ముంపు గ్రామమైన చీర్లవంచకు మంత్రి కేటీఆర్ వచ్చారు. ముందుగా గ్రామస్తుల ఘనస్వాగతం మధ్య మంత్రి చేరుకున్నారు. సుమారు గంటన్నరపాటు గ్రామంలో తిరిగారు. 1.20కోట్లతో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. 5లక్షలతో నిర్మించే ముదిరాజ్, 19.50లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పెద్దమ్మ ఆలయంలో పూజలు చేశారు.
అనంతరం అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. 12:40 గంటలకు లక్ష్మీపూర్‌కు చేరుకొని 16 లక్షలతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు. 12:57 గంటలకు పాపయ్యపల్లిలో 20లక్షలతో నిర్మించిన కొత్త పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్పంచ్ నక్క రేవతికి, పాలకవర్గానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. గ్రామస్తుల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. చిన్నారులతో కలిసి సెల్ఫీదిగారు. మధ్యాహ్నం 1:15 గంటలకు గోపాల్రావుపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కుర్చీలో కూర్చున్నట్లుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని, పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
మధ్యాహ్నం 1:40 గంటలకు తంగళ్లపల్లి పీహెచ్సీలో ఫిజియోథెరపీ సేవలను ప్రారంభించారు. జిల్లా ప్రభుత్వ దవాఖాన సేవలు ఇక నుంచి తంగళ్లపల్లి పీహెచ్సీలో అందుతాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం స్థాయిలో మొట్టమొదటి సారిగా ఫిజియోథెరపీ సేవలను తంగళ్లపల్లి దవాఖానలో ప్రారంభించినట్లు తెలిపారు. 90వేలతో ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ సిమ్యులేషన్, అల్ట్రాసౌండ్, ట్రాక్షన్ ఎలక్ట్రోథెరపీ పరికరాలను సమకూర్చినట్లు వివరించారు. సేవలు పొందేందుకు వచ్చిన ప్రజలతో అమాత్యుడు మాట్లాడారు. వారి బాగోగులు అడిగితెలుసుకున్నారు.
ఆ తర్వాత గంగభవాlw కల్యాణోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. 2:10గంటలకు మండేపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించారు. మండేపల్లికి హెల్త్ సబ్‌సెంటర్ మంజూరు చేస్తామన్నారు. మండేపల్లి పంచాయతీకి గతేడాది జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు రావడంపై సర్పంచ్, పాలకవర్గాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. మండేపల్లి అవార్డు పొందడంతో అభివృద్ధికి ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. 2:53 గంటలకు గండిలచ్చపేటకు చేరుకున్నారు. దళితబంధులో భాగంగా తండ్రీకొడుకులు చెదల దుర్గయ్య, సుమన్ కలిసి ఏర్పాటు చేసుకున్న పౌల్ట్రీఫాంను ప్రారంభించారు. ఈ సందర్భంగా తండ్రీ కొడుకులను అభినందించారు.అనంతరం 33లక్షలతో ఏర్పాటు చేసిన కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు.
Karimnagar1
అక్కడే 20లక్షలతో నిర్మించతలపెట్టిన జీపీ భవన పనులకు శంకుస్థాపన చేశారు. పంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగును ప్రారంభించారు. సర్పంచ్ నీరటి లక్ష్మికి కంటి పరీక్షలు చేయించారు. అనంతరం గ్రామంలోని బస్టాండ్‌లో అంబేద్కర్, జ్యోతిబాఫూలే, సావిత్రీబా ఫూలే విగ్రహాలను ఆవిష్కరించారు. అక్కడే 30 మంది దళితబంధు లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వేదికపై ప్రసంగించారు. అనంతరం 4:35 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు మంత్రి చేరుకున్నారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కులమతాలకతీతంగా గ్రామస్తులంతా కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ‘అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు’ అని సర్పంచ్ కదిరె రజిత మాట్లాడిన మాటలను మంత్రి గుర్తు చేస్తూ..
అంబేద్కర్ లేకుంటే ఓ సామాన్య మహిళ సర్పంచ్ అయ్యేది కాదని చెప్పారు. ఇలా మాట్లాడే అవకాశం దక్కింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లేనని స్పష్టం చేశారు. అనంతరం 4 కోట్లతో చిట్టివాగుపై నిర్మించిన వంతెనను సర్పంచ్ రజిత, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు చిన్నారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో కాలినడకన తిరిగారు. దారిపొడవునా వృద్ధులు, మహిళలు, చిన్నారులతో కరచాలనం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఓ చిన్నారిని ఎత్తుకొని ముద్దు చేశారు. గౌడ సంఘం, మహిళా సంఘ భవనాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలుకు చెందిన ఓ దివ్యాంగుడు, గ్రామానికి చెందిన దివ్యాంగురాలు దాయి సత్తవ్వ స్కూటీ ఇప్పించాలని వేడుకోగా, మంత్రి వారికి భరోసానిచ్చారు. తర్వాత 6.20గంటలకు బుగ్గరాజేశ్వర్తండాలో జీపీ భవనాన్ని, ఎస్టీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు.
చిన్న తండాలైనా పెద్ద గ్రామపంచాయతీలకు ఉన్నన్ని వసతులు ఏర్పాటు చేసుకున్నామని మంత్రి అన్నారు. రాత్రి 7.23 గంటలకు గుండారంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 7.40గంటలకు గంభీరావుపేట మండలం గోరంటాలకు చేరుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2014కు ముందు గ్రామం ఎలా ఉన్నది? ఇప్పుడెలా ఉన్నది? గ్రామస్తులకు గుర్తు చేశారు. పాఠశాలలో అదనపు తరగతి గదులు, పేదలకు కావలసిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, ఎత్తిపోతల ద్వారా చెరువుకు కాళేశ్వర జలాలు తీసుకువచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అనంతరం మల్లుపల్లికి చెందిన దళిత బంధు లబ్ధిదారుడు రావర్తి ఎల్లయ్య ఏర్పాటు చేసిన టెంట్ హౌస్‌ను ప్రారంభించి అభినందించారు. 8.20 గంటలకు తిరుగు పయనమయ్యారు.
ఈత కొట్టిన.. చేపలు పట్టిన
చీర్లవంచ నాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్రావు అత్తగారిల్లు. రవీందర్రావు చీర్లవంచ అల్లుడు. ఇక్కడకు వస్తే మా అమ్మమ్మ ఊరైన కొదురుపాకకు వచ్చినట్లు అనిపిస్తున్నది. నా చిన్నవయసులో చీర్లవంచ, కొదురుపాక, వర్దవెల్లి, శభాష్‌పల్లి గ్రామాలు తిరిగిన. ఇక్కడి వాగుల్లో ఈత కొట్టిన. చేపలు పట్టిన. అవన్నీ గుర్తుకొస్తున్నయ్. ఇప్పుడు ఈ వాగు సముద్రంలా కనిపిస్తున్నది. చీర్లవంచ చాలా అభివృద్ధి చెందింది. ఊర్లో రోడ్లు బాగున్నయ్.
– చీర్లవంచలో మంత్రి కేటీఆర్
నిర్వాసితులకు న్యాయం చేస్తం
చీర్లవంచ అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. మధ్యమానేరు నిర్వాసితులకు పరిహారం అందిస్తం. ఈ విషయంలో ఆందోళన వద్దు. ఇప్పటికే 95శాతం మందికి న్యాయం చేసినం. మిగతా ఐదు శాతం మందికి కూడా న్యాయం చేస్తం. త్వరలో గృహలక్ష్మి పథకం ప్రారంభమవుతుంది. ప్లాటు ఉండి ఇల్లు లేని వారికి 3లక్షల ఆర్థిక సాయం అందిస్తం.
– చీర్లవంచలో మంత్రి కేటీఆర్