కరీంనగర్ రూరల్, నవంబర్ 7: భూకబ్జాదారుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ అమ్ముకున్నదని, అతను ఓ పెద్ద దొంగ అని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం కరీంనగర్ రూరల్ మండలంలోని మొగ్దుంపూర్, మందులపల్లిలో ప్రచారం చేశారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు, నాయీ బ్రాహ్మణ, వడ్డెర సంఘం ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. సాయంత్రం నగరంలోని 22, 24, 40 డివిజన్లలో విస్తృత ప్రచారం సాగించారు.
కాంగ్రెస్ పార్టీ భూకబ్జాదారుడికి టికెట్ అమ్ముకున్నదని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్, మందులపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన ప్రచారం చేయగా, ఆయా గ్రామాల ప్రజలు మంగళహారతులు, గజమాలతో ఘన స్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లు, బోనాలతో పాదయాత్రగా ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ఓటు అమూల్యమైనదని, ఒక్కసారి తప్పు జరిగితే తెలంగాణ మళ్లీ అంధకారం అవుతుందన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు కావాలా.., ఎన్నికలప్పుడే కనిపించి ఆ తర్వాత కనిపించకుండా పోయి, జైలుకు వెళ్లి వచ్చిన నాయకుడు కావాలో ఆలోచించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు అధికారం కట్టబెడితే మరోసారి తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసి, ఇక్కడి సంపదను కొల్లగొడుతారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ అభివృద్ధి కోసం అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని నిధులు అడిగితే వెకిలిగా నవ్వాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి వందలాది కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. పచ్చని తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపి దోచుకునేందుకు షర్మిల, కిరణ్‌కుమార్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదటి నుంచి తనకు అండగా నిలిచిన మొగ్దుంపూర్ వాసులంటే అభిమానం అని, ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చరల్ కాలేజీ (మహిళా)తో పాటు పల్లె దవాఖాన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గంగుల మాట ఇస్తే తప్పే మనిషి కాదని, ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎంపీ బండి సంజయ్ గెలిచిన తర్వాత ప్రజల్లో కనిపించడం లేదన్నారు. భూ కబ్జాదారుడు, 30కిపైగా కేసులతో బైండోవర్ చేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని దుయ్యబట్టారు. మనపిల్లల భవిష్యత్ బాగుండాలంటే కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచ్ జక్కం నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ పుష్ప, ఉపసర్పంచ్ తిరుపతియాదవ్, బల్మూరి జగన్మోహన్రెడ్డి, నాగయ్య, వేల్పుల నారాయణ, జంగిల్ సాగర్, సుంకిశాల సంపత్‌రావు, తుల బాలయ్య, మంద రాజమల్లు, రాజేశ్వర్‌రావు, సర్వర్‌పాషా, తొగరు మల్లారెడ్డి, బుర్ర తిరుపతి గౌడ్, నేరెళ్ల శ్రీనివాస్, వేణుమాధవరావు, శ్రీరామోజు తిరుపతి, కూర శ్యాంసుందర్ రెడ్డి, దాడి లచ్చయ్య, దాడి లక్ష్మణ్, ఆశోక్, ఆంజనేయులు, వారాల శ్రీనివాస్, మారుతి, రమేశ్, జువ్వాడి మారుతి రావు, మధు, తాండ్ర రమేశ్, తదితరులు పాల్గొన్నారు.