కరీంనగర్: దివ్యాంగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోందని.. దివ్యాంగులకు వంద శాతం సబ్సిడీతో ఉచిత ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర బీసీ, సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్దుల సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత 70 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారి అభివృద్ది కోసం 100 శాతం సబ్సిడీతో ఉచిత ఉపకరణాలు, సాంకేతిక పరికరాలను అందిస్తుందని తెలిపారు.
దివ్యాంగులు ఆన్ లైన్లో ధరఖాస్తు చేసుకున్న వెంటనే వారి ఇంటివద్దకే పరికరాలను పంపిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు ప్రతినెల రూ.3000 పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి వెల్లడించారు. జిల్లాలో 1030 ఆన్ లైన్ ధరఖాస్తులు రాగా అందులో రూ. 1.92 కోట్లతో ఉపకరణాలను దివ్యాంగులకు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో బాగంగా కరీంనగర్ డివిజన్ పరిధిలో దివ్యాంగులకు సుమారు రూ.60 లక్షలతో 152 ఉపకరణాలను పంపిణి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉపకరణాలను నూటికి నూరు శాతం సబ్సిడీతో దివ్యాంగులకు అందజేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 21 వేల మంది దివ్యాంగులకు ప్రభుత్వం పించన్లు అందజేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని వెల్లడించారు. 2016 వికలాంగుల హక్కుల చట్టం కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు కేటాయించిన స్థలంలో దివ్యాంగుల కోసం భవన నిర్మాణం చేయాలని కోరారు. డబుల్ బెడ్ రూం ఇళ్లలో ప్రభుత్వ నిబంధన ప్రకారం దివ్యాంగులకు 5శాతం ఇళ్లను కేటాయించాలని కోరారు.
అనంతరం సుమారు రూ.60 లక్షల విలువ గల 152 పరికరాలను దివ్యాంగులకు మంత్రి చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపా రాణి, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత మంత్రి గంగుల.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.