Minister Adluri | కోరుట్ల, జూన్ 28: రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారి గా కోరుట్ల పర్యటనకు వచ్చిన ఎస్సి, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు శనివారం కోరుట్లలో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీ కొరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి జువ్వాడి నర్సింగ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సాయిబాబ ఆలయం వద్ద మంత్రిని పూలమాలలతో సన్మానించి, ఘన స్వాగతం పలికారు.
కోరుట్ల బస్టాండ్ సమీపంలో గల అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈనెల 15న గణపతి విగ్రహాల తయారీ కేంద్రం వద్ద కరెంట్ షాక్ తో మృతి చెందిన అల్వాల వినోద్, వెల్లుట్ల సాయి కుటుంబ సభ్యులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్లతో కలిసి మంత్రి పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 5లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును, మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి, ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. తర్వాత కల్లూర్ రోడ్డులో గల ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించిన మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
అంతకుముందు కోరుట్ల కి వచ్చిన మంత్రి లక్ష్మణ్ కుమార్ ను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి హోదాలో తొలిసారిగా కోరుట్ల కి వచ్చిన లక్ష్మణ్ కుమార్ కు ఎమ్మెల్యే మొక్కను అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్య ప్రసాద్ , విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.