Drinking water | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 7: వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మండలం లోని గ్రామాల్లో ఎక్కడ కూడా ప్రజలకు తాగు నీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులతో తాగునీటి సమస్యపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ వేసవికాలంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని సూచించారు.
నిమ్మనపల్లి లో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసే విధంగా పంచాయతీ కార్యదర్శి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుద్యం పనులను నిరంతరం చేపట్టాలని, వేసవికాలం దృష్ట్యా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో మంచి నీరు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశం లో మండలం లోని ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.