కార్పొరేషన్, జూన్ 16: ముస్లింలు ఘనంగా జరుపుకొనే బక్రీద్‌కు నగరంలోని అన్ని ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఆదివారం రేకుర్తి సాలేహనగర్ ఈద్గాను ఆయన సందర్శించారు. స్థానిక కార్పొరేటర్ సుధగోని మాధవీకృష్ణగౌడ్, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులతో కలిసి నగరపాలక సంస్థ తరఫున చేసిన బక్రీద్ పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా ఉన్న సాలేహనగర్ ఈద్గాతో పాటు రేకుర్తి, చింతకుంట, మానేరు డ్యాం, నగరంలోని పురాతన ఈద్గాల వద్ద రూ.23 లక్షలతో ఏర్పాట్లు చేశామన్నారు.
ఈద్గాల ఆవరణను పరిశుభ్రం చేయించడంతో పాటు చలువ పందిళ్లు, గ్రీన్ కార్పెట్లు, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించామన్నారు. ఎకడా ఇబ్బందులు లేకుండా ముస్లింలు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకొనేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. నగరపాలక సంస్థ బాధ్యతగా అన్ని మతాలను గౌరవిస్తూ వారి వారి పండుగలకు నిధులు కేటాయించి ఏర్పాట్లు చేస్తున్నదని పేర్కొన్నారు. తమ పాలకవర్గం వచ్చిన తర్వాత అన్నిమతాల వారు తమ పండుగలు ఘనంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని గుర్తు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, షకీరా అంజూమ్ బరత్ అలీ, గౌసియా బేగం అబ్బాస్ సమీ, షరీఫొద్దీన్, అఖిల్ ఫిరోజ్, ఎంఐఎం నేత సయ్యద్ హమీద్ హుస్సేన్, అజార్, అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన మున్పిపల్ చైర్పర్సన్.
హుజూరాబాద్ రూరల్, జూన్ 16: పట్టణంలో బక్రీద్ పండుగ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ పరిశీలించారు. ముందస్తుగా ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట కౌన్సిలర్ ఉస్మానూరిన్, మాజీ కో ఆప్షన్ మెంబర్ ఇమ్రాన్, ముస్లింలు ఎండీ షఫీ, ఇర్ఫాన్, హర్షత్, అమాన్‌తో పాటు తదితరులు ఉన్నారు.