Dharmaram | ధర్మారం, మే 29 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఇంజపురి కనకయ్య (40) వడదెబ్బతో మరణించాడు. స్థానికుల ప్రకారం.. కనకయ్య కొన్నేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్లి స్వగ్రామానికి తిరిగి వచ్చి స్థానికంగా తాపీ మేస్త్రి, సెంట్రింగ్ వర్కర్ గా పని చేస్తున్నాడు. కనకయ్యకు భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సెంట్రింగ్ కూలి పని చేయడానికి జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రానికి వెళ్లాడు.
అక్కడ పనులు చేస్తున్న క్రమంలోని ఎండ దెబ్బ తగిలి కనకయ్య తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. తోటి కూలీలు అతనిని చికిత్స కోసం జగిత్యాల జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అతడు మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. కూలీ నాలీ చేసుకొని బతికే కనకయ్య వడదెబ్బతో మరణించడంతో గ్రామంలో విషాదం ఏర్పడింది. కనకయ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆ గ్రామ సర్పంచ్ దూడ ప్రియాంక తిరుపతి కోరారు.