స్థానిక సంస్థల ఎన్నికలపై సవాలక్ష అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే, మరోవైపు షెడ్యూల్ విడుదల చేయడం పై అనేక సందేహాలు కలుగుతున్నాయి. అందులోనూ ఓ క్లారిటీ లేకుండా జిల్లా, మండల ప్రజా పరిషత్తులు, గ్రామ పంచాయతీలకు ఒకేసారి జారీ చేయడం తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నది.
లోకల్ బాడీ పాలకవర్గాలకు గడువు మీరి నెలలు గడుస్తున్నా పట్టని సర్కారు, ఇపుడు హడావిడి చేయడం వెనక పెద్ద రాజకీయ డ్రామా నడుస్తున్నదనే చర్చ జరుగుతున్నది. మరో పక్క ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న అధికారులు, ఏ మండలంలో.. ఏ విడతలో ఎలక్షన్లు నిర్వహిస్తామనేది ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తున్నది. మరో ఎనిమిది రోజులైతేనే ఏం జరుగుతుందనేదానిపై స్పష్టత వచ్చే అవకాశమున్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీలకు 2024 ఫిబ్రవరి 2న, మండల, జిల్లా ప్రజాపరిషత్తులకు అదే ఏడాది జూలై 4న పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికల ఊసెత్తని రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు హడావిడిగా షెడ్యూల్ ప్రకటించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల హామీలో స్పష్టం చేసింది.
ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. అది పెండింగ్‌లో ఉండగానే, బీసీల రిజర్వేషన్లపై ప్రత్యేక జీవోను ఇచ్చింది. ఈ జీవో ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం సీట్లు కేటాయిస్తూ శనివారం అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించే రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని గతంలోనే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కల్పిస్తున్న 42 శాతం రిజర్వేషన్ల కారణంగా 50 శాతం దాటాయని అదే కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులు హై కోర్టును ఆశ్రయించినట్టు చర్చ జరుగుతున్నది. ఈ విషయమై కోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలోనే శనివారం రిజర్వేషన్లు ఖరారు చేయడంపై రాజకీయ వర్గాల్లో అనేక అనుమాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ ఆర్భాటమే ఎక్కువ
రిజర్వేషన్లపై బీసీలకు ఇచ్చిన హామీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ హడావిడే ఎక్కువ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమకు కల్పిస్తున్న రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ వర్గాలు మొదటి నుంచీ గొంతు చించుకొని అరుస్తున్నాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బిల్డప్‌లు ఇస్తున్నదే తప్ప, ప్రయత్నంలో చిత్తశుద్ధి కనిపించడం లేదనే విమర్శలున్నాయి.
తమపై చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో చర్చకు పెట్టి, 9వ షెడ్యూల్లో చేర్చేందుకు ప్రయత్నించేదని, రిజర్వేషన్లపై ఇచ్చే ప్రత్యేక జీవోపై ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసి, కోర్టులో నిలబదనే సత్యం కూడా తెలిసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రాజకీయ డ్రామా ఆడుతున్నదని బీసీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని స్పష్టం చేస్తున్నారు. బీసీలను మభ్యపెట్టేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శిస్తున్నారు.
జిల్లాలోనూ గందరగోళం
స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికారులు కొన్ని నెలలుగా ఏర్పాట్లు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. బ్యాలెట్ పత్రాల కోసం గుర్తులు కూడా కేటాయించారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటరు జాబితా, పోలింగ్ బాక్స్‌లు ఇలా ప్రతి ఒక్క సామగ్రిని సిద్ధంగా ఉంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ క్షణంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎన్నికల నిర్వహణకు సంసిద్ధులై ఉన్నారు. అందులో భాగంగా శనివారం కలెక్టర్ పర్యవేక్షణలో జడ్పీటీసీలు, ఎంపీపీలకు, ఆర్డీవోల సమక్షంలో ఎంపీటీసీలు, సర్పంచులకు, ఎంపీడీఓల సమక్షంలో వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేశారు.
అయితే సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత జిల్లా అధికారులు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయాన్ని స్థానికంగా ప్రకటించాల్సి ఉంటుంది. అంతే కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ఏ విడుతలో, ఏ మండలంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారో స్పష్టం చేయాల్సి ఉంటుంది.
కానీ. ఈ సారి అలా చేయకుండానే కలెక్టర్ అధ్యక్షతన ఉన్నతాధికారుల సమావేశం మాత్రమే జరిగింది. ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ ఏ విడుతలో.. ఏ మండలంలో ఎన్నికలు జరుగుతాయనేది ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాన్ని సోమవారం రాత్రి వరకు కూడా జిల్లా అధికారులు ప్రకటించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది.
ఎన్నికలు ఉంటాయా..? ఉండయా..?
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయ డ్రామాను పరిశీలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా.. లేదా..? అనే సందిగ్ధత కనిపిస్తున్నది. రిజర్వేషన్లపై హై కోర్టు పరిధిలో విచారణ జరుగుతుండగానే రిజర్వేషన్లు ఖరారు చేశారు. వీటిలో బీసీలకు 42 శాతం స్థానాలు రిజర్వ్ చేశారు. ఈ విషయమై వచ్చే నెల 8న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పుఇస్తే పరిస్థితి ఏమిటనేది గ్రామాల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం ఖరారు చేసిన రిజర్వుడ్ స్థానాల్లో మార్పులు జరిగితే గ్రామాల్లో గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంటుంది.
ఎన్నడూ లేని విధంగా పంచాయతీలు, ప్రాదేశిక ఎన్నికలకు ఒకేసారి షెడ్యూల్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటనేది స్పష్టంగా తెలుస్తున్నది. హై కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడే పరిస్థితి ఉంటుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ రిజర్వేషన్ల విషయం పీఠముడిగా మారింది. అందులో స్పష్టత వస్తే తప్ప స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
మరో పక్క స్థానాల కేటాయింపులో పారదర్శకత కనిపించడం లేదని గ్రామాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పంచాయతీలు నిబంధనల ప్రకారం లేవని కొన్ని గ్రామాల ప్రజలు కోర్టు ఆశ్రయిస్తున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో సందిగ్ధత పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు జరుగుతాయా.. లేదా..? అనేది వచ్చే నెల 8న హై కోర్టు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉండనున్నది.
షెడ్యూల్ విడుదలపైనా సందేహాలే..
కేసు విచారణ జరుగుతున్న క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వడంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. బీసీల రిజర్వేషన్లమై శనివారం హై కోర్టులో విచారణ జరిగింది. అది అక్టోబర్ 8కి వాయిదా పడింది. కానీ, ఎన్నికల కమిషన్ మాత్రం అక్టోబర్ 9న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు మొదటి విడుత నోటిఫికేషన్ విడుదలవుతుందని ప్రకటించింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతుండగా, హై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది.
ఒకవేళ తీర్పు ఈసీకి వ్యతిరేకంగా ఉంటే పరిస్థితి ఏంటనే దానిపై జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆశావహుల్లో అంతగా ఉత్సాహం కనిపించడం లేదు. హై కోర్టు తీర్పుకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్ నడుచుకోవాల్సి ఉంటుందని తెలిసి కూడా.. వాయిదాకు ఒక రోజు తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎదురు చూస్తున్న ఆశావహులను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి.