Mandakrishna Madiga | కోరుట్ల, సెప్టెంబర్ 1: ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్లో పింఛన్దారుల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పట్టణంలోని జీఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కోరుట్ల, పరిసర గ్రామాలకు చెందిన దివ్యాంగులతో సన్నాహక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచుతామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి దివ్యాంగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ మోసం, ప్రతిపక్షాల మౌనం వల్లే దివ్యాంగులకు పెన్షన్ పెరగడం లేదన్నారు. వృద్ధులు, వితంతువుల పింఛన్లు రూ.4వేలు, వికలాంగుల పెన్షన్లు రూ.6వేలు, కండరాల వ్యాధితో బాధపడుతున్న వారికి రూ.15వేలు పింఛన్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మార్పీఎస్ ఉద్యమాల తోటే పింఛన్ పెంపు సాధ్యమవుతుందని నొక్కి చెప్పారు. హైదరాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డితో తాడోపేడో తెచ్చుకుంటామని, పింఛన్లు పెంపు సాధ్యం కాకపోతే సీఎం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి 22 నెలలు గడుస్తున్న దివ్యాంగులకు పింఛన్లు పెంచకుండా చిన్న చూపు చూస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని ఎండగడతామన్నారు. కాంగ్రెస్కు 70 శాతం మంది పేదలు ఓట్లు వేస్తేనే అధికారంలోకి వచ్చిందని ఈ విషయం గుర్తుంచు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.