జమ్మికుంట/వీణవంక, డిసెంబర్ 16: ప్రేమ పెళ్లికి కులం లేదు. మతం లేదు. ఆస్తులు, అంతస్థులే కాదు.. జెండర్ కూడా అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. ట్రాన్స్ జెండర్‌ను వివాహం చేసుకుని, ఆమెకు కొత్త జీవితాన్నిచ్చాడు. బాసటగా నిలిచాడు. వివరాల్లోకెళితే.. వీణవంక మండల కేంద్రానికి చెందిన కడూంచి మంగమ్మ-గోపాల్‌కు ముగ్గురు కొడుకులు. రెండో కొడుకు సంపత్. ఇంట్లోంచి వెళ్లి పోయి ఐదేళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్(దివ్య)గా మారాడు. కొద్ది రోజులు జగిత్యాలలో జీవనం కొనసాగించారు. ఇదే సమయంలో జగిత్యాలకు చెందిన కార్ డ్రైవర్ అర్షద్, దివ్య ప్రేమలో పడ్డారు.
పెళ్లి చేసుకుంటానని పలుసార్లు ప్రపోజ్ చేశాడు. ఇంతలో దివ్య జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌజింగ్‌బోర్డు కాలనీకి మారింది. విషయం తెలుసుకున్న అర్షద్ గురువారం జమ్మికుంటకు వచ్చాడు. దివ్యను పెళ్లికి ఒప్పించాడు. తన ప్రేయసి దివ్య కోసం అర్షద్ కాస్తా.. హర్షిత్‌గా పేరు మార్చుకున్నాడు. పలువురి సాక్షిగా మూడుముళ్లు వేశాడు. నూతన వధూవరులు శుక్రవారం ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అర్చకుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం హర్షిత్-దివ్య మాట్లాడుతూ వివాహ బంధంతో ఒక్కటైన తాము ఆదర్శవంతంగా ముందుకు సాగుతామని, ఒకరినొకరం గౌరవించుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.