Harassment by SI | ధర్మారం, జులై 6 : స్థానిక ఎస్సై శీలం లక్ష్మణ్ వేధించాడనే కారణంతో పెద్దపల్లి ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన కొండా రాములు (54) అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాములు ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దావఖానలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. రాములు చిన్న కుమారుడు సాగర్‌ను ఓ కారణంతో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు 2021 జులై 7న హత్య చేయగా ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన పోలవేణి రామయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులు 8 మందిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసు విషయంలో రాములు రాజీ పడితే నిందితుడు పోలవేణి రామయ్య రూ.22 లక్షల పరిహారం ఇస్తాడని, ఆ గ్రామ పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ హత్య కేసులో కోర్టు జడ్జిమెంట్ ప్రకారం.. శిక్ష పడితే నిందితులకు అట్టి డబ్బులు రాములు వాపస్ ఇవ్వాలని, శిక్ష పడనిపక్షంలో మృతుడి తండ్రి రాములుకు డబ్బులివ్వాలని ఒప్పందం కుదుర్చుకున్న పెద్దలు లిఖిత పూర్వకంగా ఒప్పందం రాసుకున్నారు.
ఆ డబ్బులను గత ఏడు నెలల క్రితం మృతుడి తండ్రి రాములు సోదరుడు మల్లేశంతో పాటు హత్య కేసులో నిందితుల తరఫున మరో వ్యక్తి లింగయ్య పేరిట జాయింట్ అకౌంట్లో ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ చేశారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు హత్య గావించిన వ్యక్తులకు అనుకూలంగా వాంగ్మూలమిచ్చారు. కానీ హత్యగావించబడిన సాగర్ తల్లి మాత్రం తన కుమారుడిని గ్రామానికి చెందిన రామయ్య తరఫు వ్యక్తులు హత్య చేశారని కోర్టులో తన వాంగ్మూలాన్ని చెప్పింది. మృతుడి తల్లి కోర్టులో తమకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చినందున బ్యాంకులో చేసిన డబ్బులు ఇవ్వాలని నిందితులైన వ్యక్తులకు సంబంధించిన పెద్ద మనుషులు మృతుడి తండ్రి రాములు తమ్ముడు మల్లేశంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
డబ్బులు చెల్లించే విషయంపై మల్లేశం అతని అన్న రాములతో చెప్పాడు. ఈ క్రమంలో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పినప్పటికీ పెద్దమనుషులు డబ్బులు వాపస్ ఇవ్వమని తనను వేధిస్తున్నారని రాములు శనివారం ధర్మారం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎస్సై కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్సై డబ్బులు ఇవ్వాల్సిందేనని వేధించాడని, తలకిందులు వేలాడదీసి కొడతానని రాములును హెచ్చరించాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పుకో అని వేధించాడు.
దీంతో మనస్థాపానికి గురైన రాములు ఈ విషయాన్ని 100కు ఫోన్ ద్వారా డయల్ చేసి తాను ఎస్సై వేధింపుల వల్ల మరణిస్తున్నానని, మధ్యాహ్నం తన పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా అక్కడే చికిత్స పొందుతున్నాడు.
రాములను వేధించలేదు.. : శీలం లక్ష్మణ్ ఎస్సై, ధర్మారం
నంది మేడారం గ్రామానికి చెందిన రాములు పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై స్థానిక ఎస్సై శీలం లక్ష్మణ్‌ను వివరణ కోరగా తాను రాములను వేధించలేదని చెప్పారు. హత్య కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఆ విషయంలో తాను జోక్యం చేసుకోనని రాములుకు చెప్పానని, కోర్టు పరిధిలో ఉండగా డబ్బులు ఒప్పందం కుదుర్చుకొని రాజీ పడడం సరైంది కాదని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించానని ఎస్సై లక్ష్మణ్ వివరించారు.