Who is responsible | కోల్ సిటీ, జూలై 18: గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం వరకు ప్రధాన రోడ్డు ఆక్రమణకు గురవుతోంది. రోడ్డు ప్రక్కన పుట్ పాత్ ఆక్రమించి వ్యాపారాలు చేస్తుంటే అడిగేవారు లేదన్న ధీమాతో రాను రాను మరింత ముందుకు జరుగుతున్నారు. అలా ఇప్పుడు ఏకంగా రోడ్డు మధ్యలోకే వచ్చి వ్యాపారాలు సాగిస్తున్నారు. స్థానిక వంక బెండ్ నుంచి చౌరస్తా వరకు ఇరువైపులా ప్రధాన రోడ్డునే ఆక్రమిస్తున్నారు.
నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు మధ్యలో ఏర్పాటు చేస్తున్న మొబైల్ దుకాణాలతో వాహన చోదకులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ ఆక్రమణలతో రోడ్డు ఇరుకుగా మారి తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. వీరికి ఎవరు అనుమతులు ఇస్తున్నారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వీటిపై దృష్టి సాదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.