గద్వాల, మే 10 : జిల్లాలో నత్తనడకన మక్క కొనుగోలుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 15రోజులు అవుతున్నా కాంటాల కోసం ఎదురు చూపులు, ఒక వేళ కాంటా వేసిన గోదాంకు తరలించడంలో జాప్యం జరుగుతుండడం, అకాల వర్షాలు కురుస్తుండడంతో మక్క రైతులు బిక్కుబిక్కు మంటున్నారు. ధాన్యం కొనుగోలు కోసం 15రోజులు, ధాన్యం అమ్మిన తర్వాత వారంరోజులుపాటు రైతులు తమ పంట ఉత్పత్తుల వద్ద కాపలా కాస్తున్న అధికార పార్టీ నేతలకు, అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడంతో అడుగడుగునా కర్షకులకు కష్టాలు తప్పడం లేదు.
ప్రభుత్వం వరికి బదులు ప్రత్యామ్నాయ పం టలు సాగు చేయాలని సూచించడంతో ఈ యాసంగి సీజన్లో రైతులు జిల్లాలో 86,122ఎకరాల్లో మక్క పంట సాగు చేశారు. మద్దతు ధర వస్తుందని ఆశపడి రైతులు కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొస్తే పంట పండించే కష్టం కంటే అమ్ముకోవడానికి రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ ధర వస్తుందనే నమ్మకంతో వస్తే 15రోజులైనా పంటను తూకం వేయకపోవడంతో రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతులు మార్కెట్‌కు మక్కలు అమ్ముకోవడానికి వస్తే కొనుగోళ్లు ఆలస్యంతోపాటు కొనుగోలు తర్వాత గోదాంలకు బస్తాలు తరలించక పోవడంతో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ అంతా ఎక్కడి బస్తాలు అక్కడే ఉండిపోయాయి. బస్తాలు తరలించాలని రైతులు కోరితే అధికారులు హమాలీల కొరత చూయిస్తున్నారని, దీనికి తోడు బస్తా దించడానికి రూ.10 అడుగుతున్నారు.
వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్తాకు రూ.6.50 చెల్లించాలి కాని తూకం వేసిన తర్వాత గోదాంకు తరలించడంలో జాప్యం జరుగుతుండడంతో రైతులు బస్తాకు రూ.10 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా గోదాంకు తరలించడంలో ఆలస్యం జరుగుతుండడంతో కొనుగోలు చేసిన తర్వాత కూడా రైతులు తమ ధాన్యం గోదాంకు తరలించే వరకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నది.
జిల్లాలో ఇప్పటివరకు రైతుల నుంచి 1,46,497బస్తాలు మార్క్ ఫెడ్ అధికారులు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన బస్తాలో ఇప్పటివరకు గోదాంలకు 82,372బస్తాలు తరలించారు. ఇంకా మార్కెట్ యార్డులో 64,185 బస్తాలు తరలించడానికి సిద్ధంగా ఉన్నా, ధాన్యం తరలించడానికి టెండర్ పొందిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడంతో మార్కెట్లో ఎక్కడి బస్తాలు అక్కడే ఉండిపోయాయి. దీంతో కొత్తగా మార్కెట్ ధాన్యం తెచ్చే రైతులకు స్థలం లేకుండా పోయింది. దీనికి తోడు ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో ఇంకా తూకం వేయని బస్తా లు 70వేల వరకు ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న బస్తాలు ఎప్పుడు గోదాంకు తరలించాలి, మిగత 70వేల బస్తాల మక్కలు ఎప్పుడు కాంటా వేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. దీంతో రైతులు ధాన్యం వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం త్వరగా గోదాంకు తరలించి కొనుగోలు కేంద్రంలో ఉన్న మక్కలను కాంటా వేయాలని రైతులు డిమాండ్ చే స్తున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో అని రైతులు బి క్కుబిక్కుమంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతు లు ఇబ్బందులు పడుతున్న అధికార పార్టీ నేతలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతులు వారితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయలేని పక్షంలో ఆందోళనకు సిద్ధమవుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.
కొనుగోలు కేం ద్రంలో మద్దతు ధర లభిస్తుందని మక్కలు కొనుగోలు కేంద్రాకిని తీసుకొచ్చి 15 రోజులు అయిం ది. నిన్న కాంటా వేశారు. ఎప్పుడు గో దాంకు తరలిస్తారని అధికారులను అడిగితే చెప్పలేము అంటున్నారు. అమ్మకం కోసం 15రోజులు, గోదాం తరలించడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఎప్పుడు ఇటువంటి పరిస్థితి నేను చూడలేదు. పంట పండించేది ఒక ఎత్తు అయితే దా నిని అమ్ముకోవడానికి ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. ఇదేమి ప్రభుత్వమో ఏమో.
– విజయ్‌రెడ్డి, రైతు, లత్తీపురం
పండించిన ధా న్యం అమ్ముకోవడానికి సచ్చినంత పని అవుతుంది. పంట పండించ డం ఒకటైతే, అ మ్ముకోవడం మరో ఎత్తు, మద్దతు ధర వస్తుందని ఆశపడి తెస్తే రాత్రి పగలు కావలి కా యాల్సిన పరిస్థితి, పంట అమ్ముకోవాలంటే తలమీద పానం పోతుంది. కాంటా వేయడానికి సమయం తీసుకుంటున్నారు. కాంట వేసిన త ర్వాత గోదాంకు తరలించడానికి ఆలస్యం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రెం టికి చెడ్డ రేవడిలా తయారైంది. ప్రభుత్వం స్పం దించి వెంటనే మక్కలు కొనుగోలు చేసిన వెం టనే గోదాంకు తరలించాలి.
– రాములు, రైతు, మల్దకల్