మానకొండూర్, సెప్టెంబర్ 6: గణేశ్ నవరాత్రోత్సవాలు వాడవాడలా కనుల పండువగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాల వద్ద నిర్వాహకులు మంగళవారం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్- వరంగల్ రహదారి పక్కన స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన గణేశుడి మండపం వద్ద సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలోని పలు వినాయక మండపాలను జీవీఆర్ సందర్శించారు.
మానకొండూర్ మండలంలో..
మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 6: గణేశ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా గంగిపల్లిలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లోని వినాయక మండపాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో మండపాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
చిగురుమామిడిలో..
చిగురుమామిడి, సెప్టెంబర్ 6: గణేశ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొమ్మనపల్లి, రేకొండ, ఇందుర్తి, ములనూరు, రామంచ, ముదిమాణిక్యం, గునుకుల పల్లె తదితర గ్రామాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలు గ్రామాల్లో మండపాల నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గణేశ్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు రాత్రివేళలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
శంకరపట్నంలో..
శంకరపట్నం, సెప్టెంబర్ 6: గణేశ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా కేశవపట్నం ఎత్తుగడ్డ గణేశ్ భక్త మండలి ఏర్పాటు చేసిన మండపంలో ఉదయం భక్తులు గీతాపారాయణం నిర్వహించారు. సాయంత్రం మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయ చైర్మన్ తనుకు ఓంకారం మాట్లాడుతూ భక్తులు నవరాత్రి పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామస్వామి, అసంగానంద గోశాల నిర్వాహకుడు రాజయ్య, శివాలయ నిర్వాహకులు పాలడుగుల బాబన్న, భక్తులు తనుకు సత్యనారాయణ, నాగభూషణం, శంకరానందం, అల్లెంకి మనోహర్, మర్యాల కృష్ణమూర్తి, మార్కండేయ, ప్రమోద్, గణేశ్ భక్త మండలి నిర్వాహకులు రవీందర్, కోటి, వేణు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్‌లో..
తిమ్మాపూర్ రూరల్, సెప్టెంబర్ 6: మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గణపతి మండపాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. పలు చోట్ల మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మండపాల వద్ద మహిళా భక్తులు దీపారాధన చేశారు. పలు గ్రామాల్లో పూజల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.