కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 29: రాష్ట్ర సర్కారు చేపట్టిన లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ గందరగోళంగా మారింది. కరీంనగర్ నగర పాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో దరఖాస్తుదారులకు నరకం కనిపిస్తున్నది. ఓవైపు ఫైళ్ల క్లియరెన్స్ ఎక్కడికక్కడ ఆగిపోగా, మరోవైపు పక్కపక్కన ప్లాట్లకు వేర్వేరుగా ఫీజులు రావడం, ఒకరికి రూ.వేలల్లో, మరొకరికి రూ.లక్షల్లో కట్టాలని చూపిస్తుండడంతో కంగుతింటున్నారు.
ఇదేం లెక్క అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉదాహరణకు నగరంలోని సీతారాంపూర్ ప్రాంతంలోని ఓ ఏరియాలో పక్క పక్కన రెండు గుంటల విస్తీర్ణం చొప్పున ఉన్న ప్లాట్ల యజమానులు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో ఒకరికి రూ.46,564 ఫీజు రాగా, మరొకరికి రూ.లక్షకుపైగా రావడంతో బిత్తరపోయారు. అలాగే, బొమ్మకల్ ప్రాంతంలోని గుంటన్నర స్థలానికి డాక్యుమెంట్ విలువ ప్రకారం రూ.2 లక్షల మేర ఉండగా, ఫీజు రూ.1.50 లక్షలకు పైగానే వచ్చింది.
అలాగే రాంపూర్ ప్రాంతంలోని రెండు గుంటల స్థలానికి డ్యాకుమెంట్ విలువ రూ.2 లక్షలకు పైగా ఉండగా, ఫీజు ఏకంగా రూ.5 లక్షలకు పైగా రావడం గమనార్హం. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మందికి ఇదే సమస్య తలెత్తడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. డాక్యుమెంట్ వాల్యుయేషన్ ప్రకారమే ఫీజులు వస్తాయంటూ చెబుతున్నారు. అయితే ఫీజు రాయితీకి మరో రెండ్రోజుల టైం మాత్రమే ఉండడంతో ఏం చేయాలో తెలియక అర్జీదారులు అపసోపాలు పడుతున్నారు.
వేధిస్తున్న సర్వర్ డౌన్ సమస్యలు
దరఖాస్తుల్లో లోపాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు టౌన్ ప్లానింగ్ కార్యాలయానికి రోజూ పెద్ద సంఖ్యలో వస్తున్నారు. నగరపాలక సంస్థకు వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో అత్యధికంగా షాట్ ఫాల్స్ (డ్యాకుమెంట్లు సరిగా లేవు) అన్న కారణంతోనే పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తుదారులు డాక్యుమెంట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేసినా వాటిని టౌన్ ప్లానింగ్ అధికారులు సకాలంలో పరిష్కరించకపోవడంతో ఫీజు జనరేట్ కావడం లేదు. మరోవైపు ఆన్లైన్ సర్వర్ కూడా పదే పదే డౌన్ అవుతుండడంతో గంటల తరబడి కార్యాలయంలోనే వేచి ఉండాల్సినా పరిస్థితి ఉంది.
మూడు రోజులు సర్వర్లో సాంకేతిక సమస్యలు వస్తూనే ఉన్నాయని అధికారవర్గాలే చెబుతున్నాయి. మరోవైపు నిషేధిత ప్రాంతాల పేరుతో చాలా డాక్యుమెంట్లకు అప్రూవల్ ఇవ్వడం లేదు. ఏదైనా సర్వే నంబర్లో నీటి వనరు ఉంటే ప్రొహిబిటెడ్లో చేర్చుతున్నారు. అయితే, ఆ సర్వేనంబర్కు అనుగుణంగా ఉన్న బై నంబర్లలోని నీటి వనరు గుర్తింపులు లేకున్నా ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని పెండింగ్లో పెడుతూ, ఎన్వోసీ తేవాలని ఇబ్బందులు పెడుతున్నారని అర్జీదారులు ఆరోపిస్తున్నారు.
సమస్యలు పరిష్కరిస్తాం
ఎల్ఆర్ఎస్ ఫీజుకు సంబంధించి వ్యత్యాసాలు ఉన్నవారు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం. మార్పులు చేస్తాం. గతంలో ఫీజులో మార్పులు చేసేందుకు అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ చాన్స్ ఉంది. ఇవేకాదు దరఖాస్తుదారులకు ఎలాంటి సందేహాలు ఉన్నా తమ కార్యాలయంలో సంప్రదిస్తే నివృత్తి చేస్తాం.
– వేణు, ఇన్చార్జి ఏసీపీ, టౌన్ ప్లానింగ్